తమ్ముళ్ళ దందాల కోసమే విక్రయాలపై ఆంక్షలు

హైదరాబాద్, నవంబరు 30: భూముల క్రయవిక్రయాలకు రెవెన్యూ శాఖ అనుమతిని తప్పనిసరి చేస్తూ చంద్రబాబు సర్కారు జీవో జారీ చేయటం టీడీపీ నేతలు భూ దందాలు, కుంభకోణాలకు పాల్పడేందుకేనని వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు ఆరోపించారు. ఇవి పూర్తిగా రైతు వ్యతిరేకం, ప్రజా వ్యతిరేకమైన ఉత్తర్వులని ధ్వజమెత్తారు. చంద్రబాబు పచ్చి రైతు వ్యతిరేకి అనడానికి ఇది తాజా తార్కాణమన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిరోధించేందుకే ఈ జీవో ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పడాన్ని ఖండించారు. అదే నిజమైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8వ తేదీ నుంచే అమలయ్యేలా జీవో ఎందుకివ్వలేదని సూటిగా ప్రశ్నించారు. 'ఒక రైతు భూమికి మంచి ధర వచ్చినపుడు అమ్ముకోవాలంటే ఎమ్మార్వో లేదా డీఆర్వో నుంచి అనుమతులు తీసుకోవాలంటున్నారు. వీరు ఎవరి అదుపాజ్ఞల్లో పనిచేస్తున్నారో తెలియదా? రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రెవెన్యూతో సహా అన్ని శాఖల అధికారులందరు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో మెలుగుతూ వారు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. ఇంతకంటే నిరంకుశమైన జీవో మరొకటి ఉండదు' అని అంబటి దుయ్యబట్టారు.

నిరంకుశ పాలన ఉన్న పాకిస్థాన్ లో కూడా తనకు తెలిసినంతవరకూ ఇలాంటి జీవో లేదని వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఇలాంటి జీవో ఎక్కడా జారీ కాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ భూ కుంభకోణానికి నాంది పలికే ఈ జీవోను తక్షణం ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

ఈ నెల 28వ తేదీకి ముందు జరిగిన భూ లావాదేవీలన్నీ చట్టబద్దంగా జరిగినట్లేనని, ఇకపై జరిగే వాటికే ఈ జీవో వర్తింప చేస్తామనడంలో పెద్ద మతలబే ఉందన్నారు. నారా లోకేష్ తాబేదార్లు,చంద్రబాబుకు కుడి, ఎడమలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, మురళిమోహన్, నామా నాగేశ్వరరావు లాంటి వారు లక్షల ఎకరాలు కొనుక్కుని రిజిస్టర్ చేయించుకున్నారని చెప్పారు. తమ వాళ్లంతా భూములు కొనుక్కోవడం పూర్తయింది కనుక ఇకపై జరిగే లావాదేవీలపై సీఎం ఆంక్షలు పెట్టారన్నారు.

తమకు న్యాయం చేయాలని తుళ్లూరు ప్రాంత రైతులు వేడుకుంటుంటే రాజధానిని నూజీవీడుకు, దొనకొండకు తీసుకెళ్తామని వారిని బ్లాక్ మెయిల్ చేయడం తగదని అంబటి పేర్కొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేత రైతులను సానుభూతితో అర్థం చేసుకోకుండా మాట్లాడటం తగదని అంబటి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. న్యాయమైన, ధర్మమైన పద్దతిలో రైతుల సాధక బాధకాలను తెలుసుకోవాలని కోరుతున్నామన్నారు. రాజధానిని తుళ్లూరు, నూజీవీడు, విజయవాడలో ఏర్పాటు చేయడానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, పుష్కలంగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నచోట నిర్మించాలని మాత్రమే తాము చెబుతున్నామని వివరించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెబుతున్న సీఎం చంద్రబాబు సింగపూర్, జపాన్ పర్యటనలకు ఆర్భాటంగా వెళ్లడం అభ్యంతరకరమన్నారు. 6 నెలలకోసారి జపాన్ వెళతానని చెబుతున్న చంద్రబాబు ఈసారి వెళ్లేప్పుడు ఎన్ని పెట్టుబడులు తెచ్చారో చెప్పి వెళ్లాలని డిమాండ్ చేశారు.

Back to Top