పురపాలక ఫలితాలు తక్షణమే వెల్లడించాలి

హైదరాబాద్: ‌

పురపాలక ఎన్నికల ఫలితాలను తక్షణమే ప్రకటించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. పురపాలక ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానా‌ల్లో విజయం సాధిస్తుందని చెప్పారు. తమ పార్టీకి వచ్చే ఫలితాల్లో మూడవ వంతు కూడా టీడీపీకి వచ్చే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ఎంతగా గోబెల్సు ప్రచారం చేసినా ప్రజలు మాత్రం వైయస్ఆర్‌సీపీతోనే ఉన్నారని మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ సరళి మరోసారి తేటతెల్లం చేసిందన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గట్టు ఆదివారం మీడియాతో మాట్లాడారు.

వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో నేరుగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం లేని చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష, పరోక్ష పొత్తులతో మాయాకూటములు కడుతున్నారని గట్టు విమర్శించారు. 2009లో కూడా మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక మహాకూటమిని ఏర్పాటు చేసి భంగపడిన చంద్రబాబుకు ఈసారీ అదే పరాభవం తప్పదన్నారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను కొన్ని చానళ్లు సర్వే చేసి వెల్లడిస్తే వాటిని కూడా వైయస్ఆర్‌సీపీకి ఆపాదిస్తూ టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని దుయ్యబట్టారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సర్వేలను నమ్ముకోలేద‌న్నారు. ప్రజలకు నిత్యం అండగా ఉంటూ వైయస్ఆససీపీ పనిచేస్తోందన్నారు. పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికల్లో భారీ మెజారిటీలతో దూసుకెళ్తోందని గుర్తుచేశారు.

ఎన్నికల ముందు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సర్వేల ఫలితాలంటూ తప్పుడు ప్రచారం చేయించుకునే అలవాటు టీడీపీకే ఉందని ఆరోపించారు. 2004, 2009 ఎన్నికల సందర్భంగా వారి ‘ఈనాడు’, దాని తోకపత్రికలో గెలుపు తమదేనని రాయించుకున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల ఉపఎన్నికల్లో కూడా టీడీపీ ఎనిమిది స్థానాల్లో గెలుస్తోందంటూ తోక పత్రికలో రాయించుకున్న నైజం చంద్రబాబుదన్నారు. 2009 తర్వాత రాష్ట్రంలో 52 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే టీడీపీ ఒక్కటి కూడా గెలవకపోగా 26 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన వైనాన్ని గట్టు గుర్తుచేశారు. ఎన్టీఆర్ టీడీపీ ఏర్పాటు చేసినప్పుడు 44 శాతంగా ఉన్న ఓటుషేర్, చంద్రబాబు నేతృత్వంలో 22 శాతానికి పడిపోయిందన్నారు.

2009 ఎన్నికల ప్రచారంలో జూనియర్ ఎన్టీఆ‌ర్ స్పందన చూసి పవ‌న్‌ కల్యాణ్ మరింత తాగి పడుకుంటున్నాడని చెప్పిన చంద్రబాబుకు, ఇప్పుడు అదే పవ‌న్ అపర గాంధీలా కనిపిస్తున్నారా?‌ అని నిలదీశారు. అప్పు డు జూనియర్‌కు అపూర్వ స్పందన లభించిందని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు ఆయనను ఎందుకు పక్కనపెట్టారని, ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. సింగపూర్‌లో చంద్రబాబు చీకటి వ్యాపారాలు చేస్తున్నారంటూ గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు మీడియా ముందు చెప్పడంతో పాటు కొన్ని కాగితాలు చూపించారని, సింగపూర్ లాడ్జీలో అసభ్యకరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ హోట‌ల్ బిల్లులు చూపించా‌రన్నారు. అలాంటి ముద్దుకృష్ణమ ధైర్యం ఉంటే ఇప్పుడు వాటిని బయటపెట్టాలని గట్టు రామచంద్రరావు సవాల్‌ చేశారు.

Back to Top