ఎన్నికయ్యాక బాబులో పెరిగిన ఆందోళన

హైదరాబాద్:

సీమాంధ్రలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ భారీ విజయం సాధిస్తుందని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు ధీమాగా చెప్పారు. టీడీపీ పరిస్థితి దారుణంగా దిగజారిపోనుందని, ఇక కాంగ్రెస్‌ పార్టీ మొత్తానికి తుడిచిపెట్టుకుపోనున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడక ముందే చంద్రబాబు నాయుడు తన ఓటమిని అంగీకరించారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమికి గల మార్గాలను వెతుక్కునే పనిలో ఇప్పటికే చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని ఎద్దేవా చేశారు.

నిజానికి ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకులే డబ్బు, మద్యం భారీగా పంపిణీ చేశారని, దౌర్జన్యాలకు పాల్పడ్డారని గట్టు తీవ్రంగా ఆరోపించారు. చేసిన అకృత్యాలన్నీ చేసి వాటిని అడ్డుకుకునేందుకు యత్నించిన వైయస్ఆర్‌సీపీయే అక్రమాలకు పాల్పడిందంటూ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఖండించారు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం చంద్రబాబు బిచాణా ఎత్తేసి సింగపూర్‌ వెళ్లిపోవడం ఖాయమని, ఆయన తిరిగి ఎప్పటికీ కోలుకోలేని రీతిలో ఫలితాలు రాబోతున్నాయని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. మే 16న వెలువడే ఫలితాల్లో తమ పార్టీ సీమాంధ్రలో కింగ్, తెలంగాణలో కింగ్ మేక‌ర్ అవుతుంద‌న్నారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు, పవన్‌ కల్యాణ్, యెల్లో మీడియా కలిసి దుష్ట చతుష్టయంగా ఏర్పడి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రయోజనం కలగలేదన్నారు.

ప్రస్తుతం నరేంద్ర మోడీ, పవన్‌ కళ్యాణ్‌ను మెచ్చుకుంటున్న చంద్రబాబు.. ఎన్నికల ఫలితాల వచ్చాక వారిని కచ్చితంగా విమర్శిస్తారని గట్టు వ్యాఖ్యానించారు. వారి వల్లే ఓడిపోయానని చంద్రబాబు చెప్పడం ఖాయమని పేర్కొన్నారు. తాను చేసే తప్పులన్నీ ఇతరులపై నెట్టడం చంద్రబాబుకు ఆది నుంచీ అలవాటుగా మారిందని విమర్శించారు. దాడులకు పాల్పడుతూ, దొంగ నోట్లు, మద్యం పంచుతూ టీడీపీ నేతలే పట్టుబడితే..  తీవ్ర ఒత్తిడిలో ఉన్న బాబు మాత్రం తమపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

యెల్లో మీడియా రాసిన కథనాలు ప్రతీ ఒక్కరూ నమ్మాలని, వారు చేసే ప్రతి పనికి మీడియా సంఘాలు మద్దతు ఇవ్వాలంటూ చంద్రబాబు అడ్డగోలు వాదన చేస్తున్నారని గట్టు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు చేసిన దాడుల వివరాలను మీడియాకు వెల్లడించారు. టీడీపీ నేతల వద్ద కోట్ల రూపాయలు పట్టుబడినా సమాధానం ఉండదన్నారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా మే 16 తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇక పక్కవాడి ప్రయోజనం కోసం పార్టీ పెట్టిన ఘనత పవన్ కల్యా‌ణ్‌దేనని, ఆయన కూడా మే 16 తర్వాత కనుమరుగవడం ఖాయమని గట్టు రామచంద్రరావు వ్యాఖ్యానించారు.

Back to Top