నా రక్తంలో ప్రవహిస్తున్నది వైయస్‌ఆర్‌ స్ఫూర్తి

రాయచోటిః నాలోనూ, నా కుటుంబంగా భావించే రాయచోటి ప్రజల రక్తంలోనూ ప్రవహిస్తున్నది దివంగతనేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అందించిన స్ఫూర్తేనని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సోషియల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, వారి చంచాగిరులు చేస్తున్న ప్రచారంపై శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం రాయచోటిలో ఏర్పాటు చేసిన నవరత్నాల సభ సందర్భంగా ఆవేశ భరితంగా ఆయన చేసిన ప్రసంగం పార్టీ నాయకులను, కార్యకర్తలను మరింత ఉత్తేజ పరిచింది. తప్పుడు వాగ్ధానాలతోనూ, దౌర్జన్యాలతో పార్టీనీ నడిపిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం.... వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను కొనుగోలు చేసే అతి నీచ దౌర్భాగ్య కార్యక్రమానికి ఓడిగట్టిందన్నారు. ఈ క్రమంలోనే తనతో పాటు నియోజకవర్గంలోని పలువురు వైయస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులను పార్టీ మారాలంటూ కోట్ల రూపాయల ఆశలు చూపిస్తున్నారన్నారు. టీడీపీ వారి ప్రలోభాలకు తలొగ్గే పరిస్థితి మా రక్తంలో లేదన్నారు. దివంగత నాయకుడు వైయస్‌ రాజశేఖరరెడ్డి నేర్పిన రాజకీయాలను ఒంటబట్టుకుని ప్రజలలో తిరుగుతున్నామన్నారు. మహానేత మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీని సైతం ఎదురించి పార్టీ పెట్టిన వైయస్సార్‌ తనయుడు మన ప్రియతమ నేత జగన్మోహన్‌రెడ్డి వెంట నాటి నుంచి నేటి వరకు నడుస్తున్నామన్నారు. పోరాట పటిమతో పాటు రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ, ఈ ప్రాంత ప్రజలకు అన్ని విధాల మేలు చేయాలన్న సంకల్పంతో ఉన్న ఏకైక నాయకుడు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డేనన్నారు.  ప్రజల నేత జగన్మోహన్‌రెడ్డిని వదలి వెళ్లే ప్రసక్తే లేదని నాయకులు, కార్యకర్తల హర్షధ్వానాల మధ్య శ్రీకాంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.

Back to Top