భక్తి శ్రద్ధలతో రంజాన్‌ వేడుకలు

–ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
–ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి రూరల్: రాయచోటి పట్టణ, మండల పరిధిలోని పలు గ్రామాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో రంజాన్‌ వేడుకలను నిర్వహించుకున్నారు. సోమవారం రంజాన్‌ పండుగను పురస్కరించుకుని ఉదయాన్నే ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాత రాయచోటి వద్ద మాండవ్య నదీ తీరాన ఉన్న ఈద్గాలో పట్టణ పరిధిలోని వేలాది మంది ముస్లింలు, అలాగే పలు గ్రామాల్లో ఉన్న ఈద్గాల వద్దకు చేరుకుని గురువులను అనుసరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాయచోటి పట్టణ సమీపంలోని రాయుడు కాలనీ వద్ద కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ , రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో పాటు మాధవరం, ఏకిలంకపల్లె, మాసాపేట, శిబ్యాల గ్రామాల్లోని ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈద్గా వద్ద రంజాన్‌ ప్రార్థనల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
మాండవ్య నదీ తీరాన వెలసిన ఈద్గాలో వేలాది మంది ముస్లింలతో కలిసి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. మత గురువులను అనుసరిస్తూ ప్రారంభం నుంచి ముగిసేంత వరకు ప్రార్థనలు చేశారు. అనంతరం మత గురువు ఆశీస్సులు తీసుకున్నారు. ప్రార్థనలు ముగిసిన అనంతరం చెన్న, పెద్ద అందరూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఆలింగనం చేసుకుని, ఆప్యాయంగా పలకరించారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ అప్జల్‌ అలీఖాన్, కోఆప్షన్‌ సభ్యులు సల్లాఉద్దీన్, మాజీ కోఆప్షన్‌ సభ్యులు జాఫర్, ఫయాజుర్‌ రెహ్మాన్‌ రిజ్వాన్, రియాజుర్‌ అహమ్మద్, జాకీర్, ముల్లాహజరత్‌ తదతరులతో పాటు , మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. రాయచోటి టీడీపీ ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి ప్రత్యేక రంజాన్‌ ప్రార్థనల్లో పాల్గొని, ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాయచోటి ఆర్బన్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐలు రమేష్‌బాబు, మైనుద్దీన్, మహమ్మద్‌ రఫీలతో పాలు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

తాజా ఫోటోలు

Back to Top