గడపగడపకూ వైయస్ఆర్ సీపీ

అడ్డాకుల: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా దివంగత నేత ప్రవేశపెట్టిన పథకాల అమలు జగన్‌తోనే సాధ్యమని వైయస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యురాలు వంగూరు బాలమణెమ్మ అన్నారు. ‘గడపగడపకూ వైయస్‌ఆర్‌సీపీ, ఉరూరా జెండా పండుగ’ కార్యక్రమంలో భాగంగా మండలంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డాకుల, కందూరు, తుంకినిపూర్‌లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...మహానేత ఆశయ సాధన కోసం జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ స్థాపించారన్నారు. ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు జంకుతుందన్నారు. దీనిపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం నోరు మెదపడం లేదన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల రద్దు చేయడమేగాక, ధరలు, పన్నుల మోతతో సామాన్యుల నడ్డి విరుస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని సైతం నీరు గార్చిందన్నారు.

మహానేత మరణం వెనుక సోనియా పాత్ర
భూత్పూర్: దివంగత మహానేత రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం వెనుక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అనిల్ అంబానీల పాత్ర ఉందని బాలమణెమ్మ పేర్కొన్నారు. భూత్పూర్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దివంగత నేత ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై జగన్ అక్రమంగా జైలు పాలుచేశాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. డీజిల్ ధరలను తగ్గించకపోతే వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా నాయకుడు బెక్కరి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చెన్నకేశవరెడ్డి, మండల వైయస్ఆర్‌సీపీ కన్వీనర్ హరినాథ్‌గౌడ్, నాయకులు జెట్టి రాజశేఖర్, హైదర్ అలీ, మాధవి, శారదమ్మ, మండల నాయకులు కిశోర్‌రెడ్డి, విజయ్‌గౌడ్, యాదయ్య, ఆంజి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top