ప్రజల భవిష్యత్ ను సర్వనాశనం చేస్తున్నారు

రాయలసీమ పేరు చెప్పుకొని దోపిడీ 
ప్రాజెక్ట్ లలో విచ్చలవిడిగా అవినీతి
సీమపై వివక్ష...చుక్కనీరిచ్చిన దాఖలాలు లేవు
అన్యాయంగా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు  
కేసీఆర్ కు భయపడి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు
టీడీపీ సర్కార్ పై మండిపడ్డ శ్రీకాంత్ రెడ్డి

హైదరాబాద్ః  రాయలసీమ పేరు చెప్పుకొని టీడీపీ సర్కార్ ప్రాజెక్ట్ లను దోపిడీ చేస్తోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే  రాయలసీమకు నీళ్లు ఇస్తామని మభ్యపెడుతూ ఆ ప్రాంత ప్రయోజనాలను కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు ప్రజల భవిష్యత్తును నిర్ధేశించే కృష్ణా ప్రాజెక్ట్ లపై ....టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని, దీన్ని వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందని  శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు.  

ఢిల్లీలో జరిగిన కృష్ణా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు మీటింగ్ కు ...సరైన ప్రణాళితో వెళ్లకుండా ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ రాష్ట్ర హక్కులను దెబ్బతీస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి అవసరానికి మించి నీళ్లు ఎక్కువగా వస్తున్నా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ ల పేరుతో ఎక్కువ టీఎంసీలను తోడేసుకుంటున్నా...దానికి సరైన సమాధానం చెప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ కేసులకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమైన అంశాల్లో నీటి సమస్య ఒకటని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. వైయస్సార్సీపీని గానీ, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను గానీ సంప్రదించకుండా, అపెక్స్ కౌన్సిల్ ను గట్టిగా పట్టుబట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు.  

ఏపీ ప్రజల గుండె చప్పుడు అయిన పోలవరం ప్రాజెక్ట్ ను ఎవరూ సరైన రీతిలో తీసుకురాని నేపథ్యంలో...మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుకు వచ్చి అనుమతులు తెప్పించి నిధులు కేటాయించడంలో ఉత్సాహం చూపించారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి క్లియరెన్స్ లో అడ్డంకులు సృష్టించినా,  ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో వైయస్సార్  రైట్, లెఫ్ట్ కెనాల్ ను పూర్తి చేస్తే....పట్టిసీమ పేరుతో రూ. 1800 కోట్ల అవినీతికి పాల్పడి అక్కడ నాలుగు పంపులు బిగించి నధులు కలిపేశామని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమన్నారు. రాయలసీమ కోసమే పట్టిసీమ అని చెప్పిన ప్రభుత్వం దాన్ని కట్టాక రాయలసీమకు చుక్క నీరైనా ఇచ్చిందా అని నిలదీశారు. పట్టిసీమ ఓ వేస్ట్ అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమా కాదా అని తమ ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్ లో ప్రశ్నించారని, బీజేపీ సైతం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేసినా నిర్లక్ష్యం చేస్తూ....అంతర్భాగం కాదని టీడీపీ చెప్పిన విషయాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు దీన్నే అదునుగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం  పట్టిసీమ కింద 40 టీఎంసీల వాటా, పోలవరం కింద 95 టీఎంసీలు వాటా కావాలని కోరుతోందన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

గతంలో ఆరు జిల్లాల అవసరం తీర్చే ఉద్దేశ్యంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి  పోతిరెడ్డి పాడు కడుతుంటే దానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టి దేవినేని ఉమ రాయలసీమ వ్యతిరేకతను చూపారని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అలా వ్యతిరేకత చూపించాడనే  బాబు దేవినేని మంత్రిగా చేసి మళ్లీ ఇవాళ రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం జలాశయంలో  854 అడుగులు మెయింటెన్ చేస్తేనే వెలిగొండ, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ప్రాజెక్ట్ లకు  నీళ్లు వస్తాయని తాము గొంతు చించుకున్నావినకుండా....తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ఇద్దరూ నిర్ధాక్షిణంగా  పవర్ పేరుతో శ్రీశైలం ఖాళీ చేశారన్నారు. డెడ్ స్టోరేజ్ లో కూడా నీళ్లు తోడేస్తున్నారని నిప్పులు చెరిగారు.  

800 అడుగుల నుంచే కేసీఆర్  120 టీఎంసీలు డ్రా చేసేందుకు పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్ట్ లు కడితే ఇక రాయలసీమకు ఏం మిగులుతుందని నిలదీశారు. ఏపీ ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైన టీడీపీ రివర్ బోర్డ్ మీటింగ్ లో రాయలసీమ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. రాయలసీమ పేరు చెప్పుకొని దోపీడీకి పాల్పడుతున్నారు తప్పితే....నీళ్లు ఇచ్చి ఆదుకోవాలన్న చిత్తశుద్ధే ప్రభుత్వానికి లేదన్నారు. ఈరకంగా అన్యాయం జరుగుతుందని వైయస్ జగన్ దీక్ష చేపట్టి ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం కరువైందన్నారు. ఎందుకు ఈరకంగా ఓ ప్రాంతాన్ని అన్యాయం చేస్తున్నారని టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

అన్ని ప్రాంతాలను సమానంగా చూడమంటే ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ టీడీపీ వాళ్లు తమపైనే ఎదురుదాడి చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి వాపోయారు. తెలుగు ప్రజలు కలిసుండాలని చెప్పిన ఏకైక పార్టీ వైయస్సార్సీపీ అని తెలియజేశారు. రాయలసీమపై ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండపై కృష్ణా బోర్డు మీటింగ్ లో ఒక్క మాటైనా మాట్లాడారా...?
ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ప్రభుత్వం  సరైన రీతిలో వ్యవహరించకపోవడం వల్లే  రాష్ట్రానికి ఈదుస్థితి వచ్చిందన్నారు. ఆనాడు బాబు అధికారంలో ఉన్నప్పుడు  ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోలేదు. ఇవాళ కేసులకు భయపడి  తెలంగాణ సర్కార్ ను నిలదీయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

తమకు కావాల్సింది చంద్రబాబు డైలాగులు కాదని.... ప్రాజెక్ట్ లు పూర్తి చేసి నిళ్లివ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు మోటార్లు బిగించి నధుల అనుసంధానం అయిందని చెప్పి పట్టిసీమలో 700 కోట్లు దోచుకున్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ 100 కోట్ల ప్రాజెక్ట్ పనులను 450 కోట్లకు పెంచి అడ్డగోలుగా దోచుకున్నారు. కోట్లాది ప్రాజక్ట్ లను నామినేషన్ పద్ధతిన ఇచ్చి ఇష్టమొచ్చినట్లు వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. అధికారులను కాంట్రాక్ట్ లను చేస్తున్నారు. హంద్రీనీవాలోని ఓ ప్యాకేజ్ లో  టీడీపీ నాయకుడికి నామినేషన్ పైన ఎక్స్ పీరియన్స్ లేకున్నా కట్టబెట్టారు. డబ్బులు పిండుకొన్న తర్వాత అది చేయలేము అని చెబితే పదింతలు ఎక్సస్ కు పెంచి టెండర్ల మాటున మరోమారు దోపిడీ చేశారు. 8వ ప్యాకజీలో 30 కోట్ల పెండింగ్ వర్క్ ని 170 కోట్లకు పెంచారు. ప్రభుత్వ దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 

అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో తాము ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా కూడా... ప్రజలు సిద్ధేశ్వరం ఏవిధంగా తరలివెళ్లారో రిపోర్ట్ తెచ్టుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి హితవు పలికారు. కేసీఆర్ మహారాష్ట్రతో సంప్రదించి ఆనకట్టలు కడుతూ కో ఆర్డినేట్ చేస్తుంటే బాబుకు ఆ ఆలోచనే లేకపోవడం దురదృష్టకరమన్నారు.  ఇప్పటికైనా  కళ్లబొల్లి మాటలు చెప్పడం మానుకొని నీళ్లు తెచ్చే విధంగా చూడాలన్నారు. కరవు ప్రాంతాల్లో  తాగునీటితో పాటు కనీసం ఆరు తడి పంటకు నీళ్లిచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి పోరాడుదామని, అఖిలపక్షాన్ని పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం వినకపోవడం దుర్మార్గమన్నారు. పిలిస్తే వాళ్ల తప్పులు బయటపడతాయని భయపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి ఇప్పటికైనా ఆలోచన చేయాలన్నారు. ఎంతసేపు అధ్భుతాలు చేస్తాం. గ్రహాలన్నంటికీ రాజధాని నిర్మిస్తాం. మేం చక్రవర్తులం. ఇతర గ్రహాలన్నంటికీ వారధులు కట్టేస్తామన్న మాటలు మానుకోవాలన్నారు.  రియాల్టీకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేవిధంగా బోర్డుపై ఒత్తిడి పెంచి అన్యాయం జరగకుండా చూడాలని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.  

Back to Top