వరంగల్ జిల్లాలో ముగిసిన తొలివిడత పరామర్శ యాత్ర

వరంగల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు  జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన తొలివిడత పరామర్శ యాత్ర ముగిసింది. ప్రజలు ఆమెకు అడుగడుగునా  నీరాజనం పలికారు.  మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను  షర్మిల పరామర్శించారు. వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. 
 
జిల్లాలోని పలు గ్రామాల్లో  షర్మిల సుడిగాలి పర్యటన చేశారు.  పరకాల నియోజకవర్గం సంగెం మండలం రామచంద్రపురంలోని బొల్లు ఎల్లమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. అనంతరం వర్దన్నపేట నియోజకవర్గంలో పర్యటించిన షర్మిల..పర్వతగిరిలోని పుల్లూరు కొమురమ్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఓదార్చారు. చివరగా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం సోమారంలో మేడిద శాంతమ్మ కుటుంబాన్ని పరామర్శించారు.  కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని   బాధితులకు పూర్తి భరోసానిచ్చారు. వైఎస్ మరణానంతరం చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆమె వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలో భాగంగా  పలువురు నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  గార్ల ఎంపీపీ సుశీల, వైస్ ఎంపీపీ నర్సింగరావులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి .....తెలంగాణ రాష్ట్ర ప్రజలు దివంగత ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన రావాలని కోరుకుంటున్నారని  అన్నారు.  షర్మిలపై తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరణ మరవలేనిదని పేర్కొన్నారు. జిల్లాలో షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు కొనసాగుతుందని పొంగులేటి స్పష్టం చేశారు.
Back to Top