ఏ జిల్లాకు ఏగినా ఏమున్నది గర్వ కారణంఆంధ్రప్రదేశ్ లోని రైతులు కష్టాల కడలి లో కొట్టుమిట్టాడుతున్నారు. రుణమాఫీ, పెట్టుబడులు దొరక్కపోవటం, నాసిరకం విత్తనాలు, ఎరువుల సరఫరాలో అవకతవకలు, ఇన్ పుట్ సబ్సిడీ్లలో కోతలు, వాన చినుకు లేక అవస్థలు, అంతిమంగా గిట్టుబాటు ధర లేకపోవటం అన్న సమస్యలు అన్ని చోట్ల రైతుల్ని వేదిస్తున్నాయి. వీటికి తోడు ఎక్కడికక్కడ రైతుల్ని ప్రాంతాల వారీగా సమస్యలు వెంటాడుతున్నాయి. 


సీమ రైతులకు అన్నీ కడగండ్లే

రాయలసీమ రైతులకు మొదటి నుంచి కష్టాలే వెంటాడుతున్నాయి. ఒక్క సాగునీటి
ప్రాజెక్టు కూడా పూర్తవుతుందన్న భరోసా లేదు. దీంతో ఆకాశం నుంచి వచ్చే చినుకుల కోసం
ఎదురు చూడటంతోనే సరిపోతోంది. లాటరీ టిక్కెట్ మాదిరిగా సేద్యం తయారైంది. చాలా చోట్ల
నాలుగు చినుకులు పడినప్పుడు ఆశగా విత్తుకొన్నా, తర్వాత మొలకలు ఎండిపోయి కుదేలై
పోయిన పరిస్థితి. చిన్న పాటి ఆరుతడి పంటల్ని కూడా పండించుకోలేక రైతులు దిగాలు
చెందుతున్నారు. గతంలో బోరు బావుల సాయంతో వ్యవసాయం జరిగినా చాలా చోట్ల వానలు లేక
బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో నీటి చుక్క దొరకటం లేదు. అనంతపురం వంటి చోట్ల
వ్యవసాయం చేసుకొనే దిక్కు లేక లక్షలో సంఖ్యలో రైతులు, కూలీలు ఇతర ప్రాంతాలకు వలస
వవెళ్లిపోయారు. అర కొరగా వ్యవసాయం చేసినా సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి
ధరల్ని అమాంతం కింద పడేస్తున్నారు. రాష్ట్రమంతా ఉల్లిపాయ కిలోకి 40 రూపాయిలు
అమ్మిన రోజుల్లో కూడా కర్నూలు మార్కెట్ లో రైతుకి కిలో ఉల్లి 10 రూపాయిలు కూడా
గిట్టుబాటు కాలేదు. అనంతపురం జిల్లాల్లో వేరుశనగ ఒక్కసారిగా పంట చేతికి అందే సరికి
రేటు పదో వంతుకి తగ్గించేశారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. పప్పులు, పప్పు
ధాన్యాల విషయంలోనూ ఇదే దయనీయమైన పరిస్థితి నెలకొంది.

 

దక్షిణ కోస్తా కు కన్నీళ్లు

ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో నీటిపారుదల ఇబ్బందిగా మారింది. చాలా చోట్ల
నీరు అదునుకి అందటం లే దు. ధనికులైన రైతులు మాత్రం ట్యాంకర్లతో నీటిని తోడి
పొలాలకు సరఫరా చేస్తున్నారు. బడుగురైతులు మాత్రం కళ్ల ముందు పొలాలు ఎండిపోతుంటే
దిగాలు చెందుతున్నారు. పొగాకు రైతుల్ని ప్రత్యక్షంగా చంద్రబాబు ప్రభుత్వమే
మోసంచేసింది. రైతుల దగ్గర నుంచి పొగాకుని కొనేందుకు మడతపేచీ పెట్టి అడ్డం
తిరిగింది. ఐదారు నెలల పాటు రైతుల్ని ఏడిపించి అప్పుడు దిద్దుబాటు చర్యలు
చేపట్టారు. వాణిజ్య పంటలు పండించే రైతుల్ని గరిష్ట స్థాయిలో ప్రభుత్వం ఉసురు
పెట్టింది.

 

మధ్య కోస్తా అంటే అడకత్తెరలో పోకచెక్క

గుంటూరు, క్రిష్ణా జిల్లాల్లో కొంత కాలం పోతే రైతులు కనిపించరు. లక్షకు పైగా
ఎకరాల భూముల్ని లాక్కోవాలని చంద్రబాబు పంతం పట్టడంతో వ్యవసాయ దారులు తమ పంట
పొలాల్ని నష్టపోతున్నారు. ఈ రెండు జిల్లాల్లోని ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా
రాజధాని రైతుల్ని దోచేసే మంత్రాంగంలో పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా
క్రిష్ణా జిల్లా రైతులు క్రాప్ హాలీడే ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
వ్యవసాయం చేయకుంటే మేలు తప్ప సాగు చేస్తే నష్టపోవటం ఖాయం అని రైతులు నిర్ణయానికి
వచ్చిన దౌర్భాగ్య పరిస్తితి.

 

గోదావరి జిల్లాల్లో సాగు తగ్గుముఖం

గోదావరి జిల్లాల రైతుల్ని పట్టిసీమ పేరుతో చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారు.
కమీషన్లు తెచ్చిపెట్టే పట్టిసీమ పథకం కోసం మొదటి విడతగా తాడిపూడి ఎత్తిపోతల
పథకానికి ఎసరు పెట్టేశారు. దీని కింద సాగయ్యే వేలాది ఎకరాలకు నీటి విడుదల కష్టంగా
మారింది. అటు పట్టిసం గ్రామం దగ్గర నీటిని తోడటం ఇబ్బందిగా మారింది. దీంతో
దొంగచాటుగా అక్కడ మెయిన్ చానెల్ కుగొయ్యి తవ్వేసి నీటిని లాగేస్తున్నారు. దీంతో
దిగువన గోదావరి డెల్టాకు నీటి విడుదల చాలా కష్టంగా మారిపోయింది. ఒక్క మాట లో
చెప్పాలంటే రబీ సీజన్ లో తక్కువలో తక్కువ 4 లక్షల ఎకరాలకు సాగునీరు లేదని అధికారులే
చెబుతున్నారు. అటు, కాల్వల కింద సాగయ్యే భూములకు అదునుకు నీరు అందించకుండా
అధికారులకు పక్క పనులు పురమాయిస్తుండటంతో వ్యవసాయం కష్టాల కడలిగా మారిపోయింది.

 

ఉత్తరాంధ్ర జిల్లాల్ని వీడని పీడకల

ఎత్తిపోతల పథకాలు, వర్షాధారిత వ్యవసాయం కావటంతో ఇక్కడ రైతులు చాలా కాలం పాటు
ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది. హుద్ హుద్ తుపాన్ తాకిడికి లక్షలాది ఎకరాల్లో పంట
నష్టం జరిగింది. ఏ ఒక్క చోట కూడా సమగ్రంగా వరద నష్ట పరిహారం అందించ లేదు. రక రకాల
కొర్రీలు వేసి రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని ఎగ్గొట్టేశారు. తనతో పాటు బహుమతిగా
చంద్రబాబు కరవును తీసుకొని రావటంతో రైతులు గజ గజ వణికిపోతున్నారు. కొన్ని చోట్ల
ట్యాంకులతో నీటిని తోడటం ఆనవాయితీ గా మారింది. కానీ ఈ తరహా పోకడలతో పెట్టుబడి
రెండు, మూడు రెట్లు పెరిగిపోతోంది. చివరకు వ్యవసాయ దారునికి నష్టాలు
మిగులుతున్నాయి.

మొత్తం మీద రాష్ట్రంలో ఏ మూల చూసిన వ్యవసాయ దారులు కష్టాల ఊబిలో కూరుకొని
పోతున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం తాపీగా రాజదాని పనుల్లో కాలక్షేపం
చేస్తోంది. దీంతో రైతుల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది.

 

 

Back to Top