అప్పుల బాధలు తాళలేక కౌలు రైతు మృతి

నందికొట్కూరు: అప్పుల బాధలు భరించలేకనే కౌలు రైతు గుండెపోటుతో మృతి చెందడం జరిగిందని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. సోమవారం మండల పరిధిలోని 10 బొల్లవరం గ్రామంలో బోయ రామకృష్ణ(36) మృతదేహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే ఐజయ్య నివాళ్లు అర్పించారు. కౌలు రైతులను ప్రభుత్వం విస్మరించడం వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కౌలు రైతులకు కార్డులిచ్చి అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంక్‌ రుణాలు, సబ్సీడి విత్తనాలు, వ్యవసాయ పరికరాలు అందక, అప్పులు తీర్చలేక గుండెపోటుతో, ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందుతున్నా ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లు లేదని మండిపడ్డారు. రాజన్న రాజ్యాం వస్తే రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయడం జరుగుతుందని చెప్పారు. ఈయన వెంట వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు కాంతారెడ్డి, నాగభూషణంరెడ్డి, తదితరులు ఉన్నారు.

Back to Top