రాష్ట్రంలో రాక్షస పాలన

మడకశిర: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని పార్టీ సీనియర్‌ నేత డాక్టర్‌ తిప్పేస్వామి మండిపడ్డారు. గురువారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద సంఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాల పక్షాన నిలబడి వైయస్‌ జగన్‌ మాట్లాడటం తప్పా అంటూ నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసుల తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. డాక్టర్‌ తిప్పేస్వామి మాట్లాడుతూ విజయవాడ వద్ద దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద సంఘటనలో 11 మంది మృతి చెంది, 30మంది వరకు గాయపడ్డారని తెలిపారు. అయితే ప్రభుత్వం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకుండా రక్షించడానికి ప్రయత్నించడం అన్యాయమన్నారు. ప్రతిపక్షనేతపై అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. వెంటనే ఈ బస్సు ప్రమాద సంఘటనపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్‌ జగన్‌పై బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

Back to Top