ఎన్ని కుట్రలు జరిగినా వైయస్‌ఆర్‌సిపికే పట్టం

‌నందివాడ (కృష్ణాజిల్లా) : అసమర్థ కాంగ్రెస్‌, దానితో అంట కాగుతున్న టిడిపి ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్ర ప్రజలు మాత్రం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే పట్టం కడతారన్న ధీమాను పార్టీ రైతు విభాగం కన్వీనర్‌ ఎవిఎస్‌ నాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ముఖ్య భూమిక పోషిస్తాయని ఆయన తెలిపారు. సహకార సంఘాల ఎన్నికల బరిలో నిలిచిన వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థులను గెలిపించాలని నాగిరెడ్డి కోరారు. నందివాడ మండలంలోని పుట్టగుంటలో వైయస్‌ఆర్‌సిపి అభ్యర్థి కొండపల్లి కుమార్‌రెడ్డి తరఫున శనివారం ఆయన ప్రచారం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి సహకార సంఘాల పురోగతికి రూ.1800 కోట్లు కేటాయించారని నాగిరెడ్డి గుర్తు చేశారు. నష్టాల బాటలో ఉన్న ‌అనేక బ్యాంకులను అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఘనత మహానేత వైయస్‌ఆర్‌కే దక్కుతుందన్నారు. సహకార ఎన్నికల్లో దొడ్డిదారిలో‌ అయినా గెలవటానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతున్నదని నాగిరెడ్డి ఆరోపించారు. ప్రస్తుత విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఎక్కువగా ఓట్లు నమోదు చేసుకుంటున్నట్లు తెలిపారు. గడువు చివరి రోజే 10 లక్షల ఓట్లు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో కుట్ర పన్నుతుందో ప్రజలకు అర్థమవుతోందన్నారు.
Back to Top