ఎన్నికల తరుణంలో ముఖ్యమంత్రిగారి ప్రేమ

సూర్యతండా(వైరా) 01 మే 2013:

  ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ముఖ్యమంత్రిగారికి అందరిపై ప్రేమ పుట్టుకొస్తోందని శ్రీమతి వైయస్ షర్మిల మండిపడ్డారు. ఆడపడుచులపై ఆయనకు నిజంగా ప్రేముంటే ఇన్ని అత్యాచారాలు చోటుచేసుకునేవా అని ఆమె ప్రశ్నించారు. వయసుతో సంబంధం, వావీ వరుసా కూడా లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నందునే ఇలాంటివి సంభవిస్తున్నాయని ఆరోపించారు. 135వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల బుధవారం నాడు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో పర్యటించారు. కామేపల్లి మండలం ముచ్చెర్ల నుంచి బుధవారం ఉదయం పాదయాత్ర ఆరంభమైంది. సూర్యతండాలో మహిళలతో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి కూడా చంద్రబాబు దారిలోనే పయనిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం పాలనలో రైతులు, కార్మికులు చితికిపోయారని చెప్పారు. ఆడబిడ్డలమీద ప్రేమతో బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టానంటున్న కిరణ్ కుమార్ రెడ్డి ఓసారి తన వ్యాఖ్యను పునః పరిశీలించుకోవాలని సూచించారు.

దివంగత మహానేత డాక్టర్  వైయస్ఆర్  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యాచారాలకు కఠిన శిక్షలుండేవన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలకే పరిమితమని, కార్యాచరణకు ఆయన పనికిరాడని శ్రీమతి షర్మిల విమర్శించారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ 30 కేజీల బియ్యం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున వాగ్దానం చేశారనీ, ఆయన జీవించి ఉంటే దీనిని అమలు చేసేవారనీ చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికీ ఈ వాగ్దానం అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

దయనీయస్థితిలో రైతులు
మహానేత పాలనలో రెండు పంటలకు నీళ్లొచ్చాయనీ,  ఏడు గంటలు ఉచిత విద్యుత్ అందిందనీ తెలిపారు.  రైతులు, కూలీలు బాగుపడ్డారన్నారు. ఈ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తోందన్నారు. మహానేత  హయాంలో మిర్చికి క్వింటాలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఇచ్చారన్నారు. ఇప్పుడు కేవలం రూ.4 వేలే ఇస్తున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

జగనన్న ముఖ్యమంత్రయితే  ‘అమ్మ ఒడి’ పథకం
ఆడపిల్లలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడతామని పార్టీ ప్లీనరీలో శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని శ్రీమతి షర్మిల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ పథకం ప్రకారం.. పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.700 చొప్పున, ఏడాదికి రూ.8,400, డిగ్రీ విద్యార్థులకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున, ఏడాదికి రూ.12 వేలు వారి తల్లి బ్యాంకు ఖాతాలోనే జమవుతాయని వివరించారు. ఆడా మగా తేడా లేకుండా అందరూ చదివేందుకు ఈ డబ్బులు ఉపయోగపడతాయన్నారు.  ఇప్పుడు ఏడాది మిగిలి ఉండటంతో బంగారు తల్లి అంటూ కిరణ్ కుమార్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆడబిడ్డలపై ప్రేమతో పెట్టినది కాదని శ్రీమతి షర్మిల అన్నారు.

Back to Top