బాబు అరాచకాలకు త్వరలోనే ముగింపు

– పంచ భూతాలను పంచుకు తింటున్నారు
– అఖిల ప్రియను అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు
– చంద్రబాబు దావోస్‌ పర్యటన శుద్ధ దండగ
– విమర్శలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి
– ప్రభుత్వానికి బొత్స సత్యనారాయణ హితవు

హైదరాబాద్ః తమ అధినేత వైయస్‌ జగన్‌ సభలకు  వస్తున్న స్పందన చూడలేకే టీడీపీ భూమా అఖిల ప్రియను అడ్డుపెట్టుకుని సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. రెండు రోజులుగా అమరావతి, గుంటూరు జిల్లాల్లో వైయస్‌ జగన్‌ పర్యటించి లేవనెత్తిన సమస్యలపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో ఇప్పటికే 33 వేల ఎకకాలు దండుకున్న ప్రభుత్వం, మరో 32 వేల ఎకరాల ఫారెస్టు ల్యాండ్‌ను డీనోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరడంపై ఆయన మండిపడ్డారు. రైతులకిచ్చే నష్టపరిహారంలో కూడా వ్యత్యాసం చూపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికార దాహంతో ఏం చేసినా చెల్లుబాటవుతుందని చంద్రబాబు కలలు కంటున్నారని.. అరాచకాలకు ముంగింపు పలికే రోజులు దగ్గరపడ్డాయని ఆయన హెచ్చరించారు. అఖిల ప్రియ మీద వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారనడం సరికాదు. పోలీసులు ముందుగానే హెచ్చరించారు.. ఆమె కూడా తెలియకనే ఈ దారిలో వచ్చానని చెప్పిన విషయం గుర్తుచేసుకోవాలన్నారు. 

ఆ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి
ఈ రెండు రోజులుగా మా అధినేత వైయస్‌ జగన్‌ లేవనెత్తిన ప్రధాన సమస్యలపై మంత్రులు స్పందిస్తే బాగుంటుందని హితవు పలికారు. ప్రకాశం జిల్లాలో తాగునీరు, ఫ్లోరోసిస్‌ సమస్యలపై స్పందించకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దేశమంతా వ్యతిరేకించిన స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని ఎందుకు సమర్థించి అమలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసున్నారు. స్విస్‌ చాలెంజ్‌ వెనుకున్న గుట్టును బయట పెట్టాలన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిలో బ్రహ్మాండంగా అభివృద్ధి సాధించామని చెప్పుకంటూనే చార్జీలు పెంచడానికి సిద్ధమవుతన్నారని ఎద్దేవా చేశారు. దావోస్‌లో చంద్రబాబు ప్రసంగంపై ఛలోక్తులు విసిరారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు జీఎస్‌డీపీలో ఎలా వృద్ధి సాధించారో చెప్పడం విని విదేశీయులు నవ్వుకుంటున్నారు. పోసాని కృష్ణ మురళి సినిమాలో చేపలు చెరువును దొంగలు ఎత్తుకెళ్లారని కేసు పెట్టినట్టుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి, టీడీపీ నాయకుల ఇంట తప్ప ఎవరూ సంక్రాంతి పండగ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో పండగ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని పేర్కొన్నారు. 

పక్క రాష్రాలను చూసి నేర్చుకోండి..
చంద్రబాబు పక్క రాష్ట్రాలను చూసి ఐక్యత అంటే ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు సమస్యలపై స్పందించిన తీరును ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా ప్రత్యేక హోదా రాదా అని తమ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడుదాం రమ్మని ఎప్పుడో పిలుపునిచ్చారని తెలిపారు. టీడీపీ నాయకులు పంచభూతాలను కూడా దోపిడీ చేస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన దౌర్భాగ్య ప్రభుత్వం టీడీపీ అని తెలిపారు. నాబార్డు నిధులు ఎంతడిగారు.. ఎంతిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దావోస్‌ పర్యటన  వల్ల ఒక్క రూపాయి కూడా రాదన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తల దగ్గర కమీషన్లు దండుకుంటుంటే ఎవరూ ముందుకు రారని ఎద్దేవా చేశారు.  రెండేళ్లలో ఒక్క పరిశ్రమకైనా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ కేంద్రానికి అమ్ముడుపోయిందని దుయ్యబట్టారు. 
Back to Top