ఎమ్మెల్యే నిధుల మంజూరులోనూ వివక్షే

తిరుపతి:

ఉప ఎన్నికల్లో ఓట్లేసిన ప్రజలపై కక్షసాధించడమే కాక, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధుల  మంజూరులో కూడా ప్రభుత్వం వివక్ష చూపుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆరోపించారు. తిరుపతి అర్బన్ మండలం తిమ్మినాయుడుపాళెం పంచాయతీ లో ప్రజాబాట సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు.  ఎమ్మెల్యే వెంటనే కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి సమస్యలను వివరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు సంపాదించలేని కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత మహానేత డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డి వల్లే నేడు ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. డాక్టర్ వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కిరణ్ ప్రభుత్వం నేడు ఆయన స్థాపించిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కడమే కాకుండా ప్రజాసమస్యలను పూర్తిగా విస్మరిస్తోందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేస్తే వారికి ప్రజల్లో మంచి పేరు వస్తుందని నిధులు విడుదల చేయడం లేదని ఆరరోపించారు. ఉపఎన్నికల్లో నగర అభివృద్ధిపై  అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇస్తానని హామీ ఇచ్చిన రూ.450కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు.

Back to Top