పోతిరెడ్డిపాడు : రాయలసీమ ప్రాంత భవిష్యత్తుకు కీలకమైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు హంద్రీనీవా విస్తరణ కోసం కూడా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మిస్తూ శ్రీశైలం నుంచి 780 నుంచి 800 అడుగుల నీటిమట్టం నుంచే నీటిని తరలిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించి 800 అడుగుల నుంచే నీటిని తరలించేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచిన ఘనత కూడా వైయస్ జగన్‌కే దక్కుతుందన్నారు. 2024 మే నెల వరకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు కొనసాగాయని, కానీ జూన్ 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. ఎన్జీటీ అభ్యంతరాల కారణంగా పనులు ఆపారని ప్రజలు అనుకున్నా, వాస్తవానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం చేసుకుని చంద్రబాబు ఈ ప్రాజెక్టును రహస్యంగా నిలిపేశారని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డే వెల్లడించారని అన్నారు. మన కళ్లముందే మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి మనకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. తాగు, సాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం అత్యవసరమని, ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. ఎన్టీ రామారావు హయాంలో 40 టీఎంసీలతో చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టును చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 టీఎంసీలకు కుదించారని విమర్శించారు. వైయస్ రాజశేఖరరెడ్డి 2005లో సీఎం అయ్యాక రాయలసీమలో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా హంద్రీనీవాను 40 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారని గుర్తు చేశారు. ఆయన కృషితోనే 2012 నుంచి కృష్ణా జలాలు రాయలసీమకు వస్తున్నాయన్నారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవా సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. అయితే 2024లో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఈ సామర్థ్యాన్ని తిరిగి 3,850 క్యూసెక్కులకే పరిమితం చేశారని ఆరోపించారు. రూ.690 కోట్లతో జీడిపల్లి వరకు తొలి దశ పనులు, మరో రూ.2,000 కోట్లతో కుప్పం వరకు లైనింగ్ పనులు చేపట్టి భవిష్యత్తులో కాలువ వెడల్పు చేసే అవకాశాన్ని లేకుండా చేశారని అన్నారు. ఈ నిర్ణయాల వల్ల రాయలసీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు హంద్రీనీవా విస్తరణపై కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాయలసీమ ప్రజాప్రతినిధులంతా కలిసి ఉద్యమం చేపట్టాలని సూచించారు. శ్రీశైలం నుంచి హంద్రీనీవా ద్వారా 40 రోజుల్లో 40 టీఎంసీలు తీసుకొచ్చేలా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా పనులు చేపట్టేలా ఒత్తిడి పెంచాలని అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంపైనే పోరాటం సాగిద్దామని, చంద్రబాబు స్పందించని పక్షంలో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు.