ఎమ్మార్ కీలక నిందితుడు చంద్రబాబే

హైదరాబాద్, 10  మే  2013:

ఎమ్మార్ కేసులో కీలక నిందితుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. కోనేరు రాజేంద్ర ప్రసాద్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్ కేసులో సీబీఐ ఆఖరు చార్జిషీటు వేసిన అనంతరం, కేసు నుంచి తనను తప్పించాల్సిందిగా కోరుతూ కోనేరు రాజేంద్ర ప్రసాద్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని చెప్పారు. ఈ కేసులో కీలకమైన చంద్రబాబు నాయుడును విచారించకుండానే సీబీఐ దర్యాప్తు ముగించిందని ఆయన అందులో పేర్కొన్నారన్నారు. చంద్రబాబు నాయుడును ఉద్దేశపూర్వకంగానే విచారించలేదనీ, ఈ కేసులో తన ప్రమేయం లేదనీ కాబట్టీ తనను కేసునుంచి తప్పించాలని ఆయన వివరించారన్నారు. ఈ అఫిడవిట్‌పై సీబీఐ కూడా కౌంటర్ వేసిందని ఆయన తెలిపారు. ఈ నెల 14న దీనిపై విచారణ కూడా జరగనుందన్నారు. ఎమ్మార్ కేసులో కీలకమైన వ్యక్తి చంద్రబాబని మొదటినుంచీ తాము చెబుతూనే ఉన్నామని చెప్పారు. చంద్రబాబుతో వ్యవహారం నడిపి ఎమ్మార్ ప్రాపర్టీస్ హైదరాబాద్ రావడానికి కారణమైన కోనేరు ప్రసాదే రాతపూర్వకంగా అఫిడవిట్ దాఖలు చేయడాన్ని గమనించాలన్నారు.

టీడీపీ అధికార ప్రతినిధిగా 'ఈనాడు'
అఫిడవిట్ దాఖలు అంశంపై అన్ని పత్రికలూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని రాస్తే, 'ఈనాడు'  పత్రిక అప్పటి ముఖ్యమంత్రని చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా వార్త రాసిందని  చెప్పారు. దీని వెనుక ఉద్దేశం అప్పటి ముఖ్యమంత్రంటే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని ప్రజలు భావిస్తారని రాసినట్లుందన్నారు. ఈ సందర్భంగా సంబంధిత వార్తలోని అంశాన్ని చదివి వినిపించారు. చంద్రబాబు నాయుడు పేరు రాయడానికి కూడా 'ఈనాడు' సందేహ పడుతోందని అంబటి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఈనాడు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు.. పాదయాత్ర చేశారు వంటి పాజిటివ్ వార్తలలో అనేకసార్లు ఆయన పేరు రాస్తారనీ, వ్యతిరేకంగా రాయాల్సి వస్తే మాత్రం ఆయన పేరు ప్రస్తావించరని ఎద్దేవా చేశారు.

సొంత స్థలానికి ఎక్కువ ధర.. ప్రభుత్వ స్థలానికి తక్కువ ధర
ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను దుబాయ్ ప్రసాద్‌గా పేరుపడ్డ కోనేరు ప్రసాద్ హైదరాబాద్‌కు తెచ్చారనీ, చంద్రబాబు ఆ సంస్థకు 535 ఎకరాలను ఆ సంస్థకు కేటాయించారనీ అంబటి చెప్పారు. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని ఎకరం కేవలం 29 లక్షలకే ఆ సంస్థకు ధారాదత్తం చేశారన్నారు. అంతకు ముందు దానిపక్కనే  చంద్రబాబు నాయుడు సతీమణి పేరు మీద ఉన్న రెండు ఎకరాలను రెండు కోట్లకు రెడ్డీస్ ల్యాబ్‌కు అమ్ముకున్నారని అంబటి చెప్పారు. అంటే స్వస్థలాన్ని ఎక్కువ ధరకూ, ప్రభుత్వ స్థలాన్ని అత్యంత తక్కువ ధరకూ చంద్రబాబు అమ్మడాన్ని అనుమానించాలా? అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై విచారణ చేపట్టాడానికి సీబీఐ ఎందుకు సందేహ పడుతోందని నిలదీశారు. సంబంధిత జీవో జారీ చేసిన చంద్రబాబును విచారించడానికి సీబీఐ ఎందుకు సాహసించడంలేదని అడిగారు. ఈ కేసులో తనను సీబీఐ ప్రశ్నించినప్పుడు కూడా జీవో ఇచ్చింది చంద్రబాబేనని స్పష్టంగా చెప్పానని అంబటి తెలిపారు. భూమిని అతి తక్కువ ధరకే కట్టబెట్టారని చెబితే ఆలోచిస్తామని చెప్పిందే తప్ప సీబీఐ చంద్రబాబును విచారణకు పిలిచిన పాపాన పోలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రయిన మాత్రానా చంద్రబాబు ఇంటికెళ్ళి విచారించే సాహసం కూడా చేయలేదన్నారు. బదులుగా సీబీఐని చంద్రబాబు పల్లెత్తు మాట అనరని చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తటస్థంగా ఉంటారన్నారు. సీబీఐ విచారణ చేపట్టకపోవడం కుంభకోణం కాదా అని అంబటి ప్రశ్నించారు.

ముందస్తు పథకం ప్రకారమే ఎమ్మార్ సంస్థకు భూమి
అనేక సార్లు తాము ఈ అంశంపై ఆరోపణలు చేసినప్పటికీ దర్యాప్తు చేపట్టకుండా ఎందుకు తప్పుకుంటోందో సీబీఐ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌కు భూముల కేటాయింపులో ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోందన్నారు. ఈ ప్రాజెక్టు తేవడానికి 18 ఎకరాలలో ఓ గోల్ఫు కోర్సు, వాటిచుట్టూ విలాసవంతమైన విల్లాలు, స్టార్ హొటళ్ళు, అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన కన్వెన్షన్ సెంటరు ఏర్పాటు చేశారన్నారు. దీన్నో ప్రాజెక్టులా తీసుకోవాలని 2000వ సంవత్సరంలో ఏపీఐఐసీ ద్వారా ఓ నోటిఫికేషను ఇచ్చారన్నారు. కారణం తెలీదు గానీ దానిని వెంటనే రద్దు చేసి 2001 జూలై 06 తేదీన మళ్ళీ తాజా ప్రకటన ఇచ్చారని వివరించారు. దీనికి ఐదు కంపెనీలు స్పందించాయని చెప్పారు. ఒకటి ఎమ్మార్, రెండోది మలేషియాకు చెందిన ఐఓఐ, మూడోది హాంగ్‌కాంగ్‌కు చెందిన  ఎల్ అండ్ టీ, షాపుర్ జీ.. పూలన్ జీ, మరో కంపెనీ దరఖాస్తు చేసుకోగా ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీ ఎంపికచేశారన్నారు. తదుపరి కారణం తెలీకుండానే ఐఓఐ, ఎల్ అండ్ టీ తప్పుకున్నాయని అంబటి తెలిపారు. ఎల్ అండ్ టీకి కాకినాడ పోర్టునుంచి హైటెక్ సిటీ వరకూ చంద్రబాబు పనులు కట్టబెట్టారన్నారు. ఐఓఐ జెమ్సు పార్కులో పది ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు.

ముందుగానే చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రబాబు ఎమ్మార్ ప్రాపర్టీస్ సంస్థకు అసలు పని అప్పగించారని ఆరోపించారు. ఇంత తతంగం జరిగితే దీనికి ఆద్యుడైన చంద్రబాబును విడిచిపెట్టారని చెప్పారు. దీనికి కారణమేమిటో తేలాలన్నారు. దీన్నే తాము కుట్ర అంటున్నామని అంబటి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డిగారిని వేధించడానికే కేసులు పెడుతున్నారు తప్ప వాస్తవాలు బయటకు తేవాలనే యోచన సీబీఐకి లేదనడానికి ఇది తాజా ఉదాహరణని ఆయన వెల్లడించారు. డిశ్చార్జి పిటిషను దాఖలు చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తని చెప్పారు. అనేక ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెప్పించడానికి చంద్రబాబుతో లయజన్ నడిపిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అని తెలిపారు. రస్ అల్ ఖైమా, అల్యూమినియం కంపెనీని తీసుకొచ్చారన్నారు. అలాంటి వ్యక్తే కింది కోర్టులో ఇలాంటి అఫిడవిట్ దాఖలు చేసి న విషయాన్ని గమనించాలని వివరించారు.

న్యాయవ్యవస్థంటే మాకు గౌరవముంది

కోర్టులు, న్యాయ స్థానాలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తే వ్యతిరేకంగా మాట్లాడమని లేకపోతే మాట్లాడతామని కాంగ్రెస్, టీడీపీలు అంటుండడాన్ని అంబటి ఖండించారు. న్యాయస్థానాలంటే తమకు గౌరవముందని స్పష్టంచేశారు. జగన్మోహన్ రెడ్డిగారికి బెయిల్ రాకుండా మేనేజ్ చేయడానికి చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారని జూపూడి ప్రభాకరరావు చెప్పారు తప్ప.. ఏదైనా వ్యవస్థను మేనేజ్ చేయడానికి ఉన్నారని చెప్పారా అని అంబటి ప్రశ్నించారు. ఇది న్యాయవ్యవస్థని కించపరచడమా అని నిలదీశారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో దిట్టని  డీఎఫ్ఐడీ అనే బ్రిటిష్ సంస్థ చేసిన అధ్యయనంలో చెప్పిందన్నారు. ప్రతి వ్యవస్థలోనూ తన సొంత మనుషులను చొప్పింపచేసి, మేనేజ్ చేయగల శక్తి సామర్థ్యాలు  చంద్రబాబు నాయుడుకు ఉన్నాయనేది ఆ అధ్యయన సారాంశమని పేర్కొన్నారు. ఇది లిఖిత పూర్వకంగా ఇచ్చినప్పటికీ చంద్రబాబు ఆరోజు ఏమీ అనని విషయాన్ని గుర్తుచేశారు.  మంత్రి కన్నా లక్ష్మినారాయణ సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన పిల్‌లో ఇదే అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. కొందర్ని మేనేజ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళారని జూపూడి అన్నారు తప్ప న్యాయవ్యవస్థను మేనేజ్ చేయడానికి వెళ్లారనడం మర్యాద కాదని స్పష్టంచేశారు. కాంగ్రెస్, టీడీపీ పెద్దలు ఈ అంశాన్ని తెలుసుకోవాలని అంబటి హితవు పలికారు. సైకిల్ గుర్తు చంద్రబాబు నాయుడు టీడీపీ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందేనన్నారు. న్యాయవ్యవస్థల గురించి వ్యాఖ్యలు చేసే సంస్కృతి తమకు లేదన్నారు.

2014లో టీడీపీ జెండా పీకేయడం ఖాయం

వైయస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత తాలూకు ఫలితం తమకు రావడం గమనించిన చంద్రబాబు  వైయస్ఆర్ కాంగ్రెస్‌ను అణిచివేస్తే ఏదో రకంగా అధికారంలోకి రావాలని ఆశపడుతున్నారు. 2014 తర్వాత ఎవరు ఎవరిని మూస్తారో చూద్దామన్నారు. మూడోసారి ఓడిపోతే జెండా పీకేయాల్సి వస్తుందని చంద్రబాబే ఆమధ్య స్వయంగా చెప్పారనీ, అది జరిగి తీరుతుందనీ అంబటి స్పష్టంచేశారు. ఎన్టీరామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రారంభించిన టీడీపీ 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారి భూస్థాపితం కానుందని అంబటి జోస్యం చెప్పారు.

Back to Top