వైయస్‌ లాంటి సీఎంని ఎన్నుకోండి

పార్వతీపురం, 2 ఏప్రిల్ 2014:

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మనసెరిగిన వారినే సీఎంగా ఎన్నుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మరో 36 రోజుల్లో రానున్న ఎన్నికల్లో జనం మనసెరిగిన నాయకులనే ఎన్నుకోవాలన్నారు. ఎన్నికలు జరిగే ఈ 36 రోజులూ ఎంతో కీలకమైనవని ఓటర్లకు గుర్తుచేశారు. సరైన వ్యక్తిని సీఎంగా ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో బుధవారం నిర్వహించిన 'వైయస్ఆర్‌ జనభేరి' బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన సువర్ణయుగం అని శ్రీ జగన్‌ అభివర్ణించారు. నిరుపేదల కోసం తపించిన ఒకే ఒక్క వ్యక్తి వైయస్ఆర్‌ అన్నారు. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. సీఎం అంటే ఎలా ఉండాలో దివంగత మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి దేశానికి చాటి చెప్పారన్నారు. కార్పొరేట్‌ వైద్యానికి నిరుపేద దూరం కాకూడదనే మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి, అమలు చేశారని శ్రీ జగన్‌ గుర్తుచేశారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ను ఎప్పుడూ పిల్ల కాంగ్రెస్‌ అని విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడిపై వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మాది పిల్ల కాంగ్రెస్‌ అయితే.. నిరంతరం కాంగ్రెస్‌ పార్టీతో అంట కాగుతున్న తెలుగుదేశం పార్టీ 'సవతి కాంగ్రెస్సా' అని సూటిగా చంద్రబాబును ప్రశ్నించారు. గడచిన నాలుగేళ్ళుగా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కై రాజకీయాలు చేశారని శ్రీ జగన్‌ విమర్శించారు. కరెంటు చార్జీలు పెంచిన కిరణ్‌ ప్రభుత్వాన్ని విప్‌ జారీ చేసి మరీ ఎందుకు అవిశ్వాస తీర్మానం నుంచి కాపాడారని చంద్రబాబును ప్రశ్నించారు. ఎఫ్‌డీఐ బిల్లు రాజ్యసభలో వచ్చినప్పుడు తన పార్టీ ఎంపీలను గైర్హాజరు చేయించి బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలిచిన వైనాన్ని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సోనియా అడ్డగోలుగా విభజించారని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌ను సీమాంధ్రులకు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.

పార్వతీపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రసన్నను, లోక్‌సభ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపుతున్నట్లు శ్రీ జగన్‌ సభకు పరిచయం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసే వీరిద్దరికీ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తిచేశారు.

ఐదు సంతకాలు, ఈ పనులతో రాష్ట్రాన్ని మారుస్తా :
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపై తాను పెట్టబోయే ఐదు సంతకాలతో రాష్ట్రాన్ని మార్చివేస్తానని శ్రీ జగన్‌ పేర్కొన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం మొట్టమొదటి సంతకం పెడతానన్నారు. కూలి డబ్బుల కోసం ఆరో తరగతి, ఏడో తరగతి చదువుతున్న తమ పిల్లలను కూడా అక్కా చెల్లెళ్ళు పనికి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ అక్కా చెల్లీ బతకడం కోసం చదువుతున్న పిల్లలను పనికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా చేస్తానన్నారు. అక్కా చెల్లెళ్ళు  తమ పిల్లలను బడికి పంపితే వారిన ఇంజనీర్లుగానో, డాక్టర్లుగానో తీర్చిదిద్దే బాధ్యత నాదని భరోసా ఇచ్చారు. ప్రతి స్కూల్లో  ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా‌నన్నారు. బడికి పంపే ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ.1,000 బ్యాంకు అకౌంట్లో జమచేస్తానన్నారు. అందు కోసమే అమ్మ ఒడి పథకానికి సంతకం చేయబోతున్నానన్నారు.

వయసు, ఆరోగ్యం  ఒప్పుకోకపోయినా కాళ్లు ఈడ్చుకుంటూ అవ్వా తాతలు పనికి వెళ్ళే దుస్థితి నెలకొందని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వారిని పలకరిస్తే.. మీ నాయన వల్ల రూ.200 పింఛన్ వస్తోంది. ఇది ఒక్కపూట తిండికే వస్తుంది. మూడు పూటలా తినాలంటే పనులకు వెళ్లాల్సి వస్తోంది అంటున్నా‌రని చెప్పారు. అందుకే అవ్వా తాతలకు భరోసా ఇచ్చేలా రెండో సంతకం పెడతానన్నారు. పైనున్న మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి గర్వపడేలా అవ్వాతాతలకు ‌ఇచ్చే రూ.200 పింఛన్‌ను రూ.700 పెంచుతానని హామీ ఇచ్చారు. రైతన్నలు పండించే పంటలకు మద్దతు ధర, గిట్టుబాటు ధర రెండూ రావడం లేదని, అందుకే వారి సంక్షేమం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు. ఇకపై ఏ అన్నదాతకూ మద్దతు, గిట్టుబాటు ధర సమస్య లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు.

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీపై నాలుగో సంతకం పెడతానని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు.  డ్వాక్రా రుణాలు నెలవారీ వాయిదా రూ.2 వేలు కట్టడానికి డ్వాక్రా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాయిదా చెల్లించకపోతే బ్యాంకులు వడ్డీలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. అందుకోసం పిల్లలను పనికి తీసుకెళ్తున్నారని విచారం వ్యక్తంచేశారు. అందుకే నాలుగో సంతకంతో అక్కా చెల్లెళ్లకు కొత్త జీవితం ఇవ్వబోతున్నానన్నారు. వారు తీసుకున్న రూ.20 వేల కోట్ల రుణాలన్నీ మాఫీ చేయబోతున్నానని చెప్పారు.  ఐదో సంతకంతో గ్రామంలో ఏ కార్డు కావాలన్నా వారి దగ్గరే వాటిని అందించే ఏర్పాటు చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఇళ్లు లేని వారందరికీ ‌ఏ కార్డు కావాలన్నా ఏ రాజకీయ నాయకుడివద్దకూ వెళ్లనవసరం లేకుండా మీ వార్డు, మీ గ్రామంలోనే ఆఫీసు తెరిచి అక్కడే అన్నీ పెట్టి అడిగిన వారికి 24 గంటల్లో కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తానన్నారు.

మహానేత వైయస్ఆర్ ‌మరణించాక రాష్ట్రంలో పేదవాడికి ఇల్లు కట్టించాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండాపోయిందన్నారు. ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో వైయస్ఆర్ రాష్ట్రంలో 48 లక్షల ఇళ్లు కట్టించా‌రన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయం మేరకు ఇళ్లు లేని నిరుపేదలకు వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టిస్తానన్నారు. 2019 నాటికి మన రాష్ట్రంలో ఏ గ్రామంలోనూ ఏ ఒక్క పేదవాడూ ఇల్లు లేనివాడిగా లేకుండా చేస్తానన్నారు. ఆరోగ్యశ్రీ నుంచి ఇప్పుడు 133 రోగాలు తొలగించారన్నారు. ఏ రోగి అయినా ఆస్పత్రికి వెళ్తే  వైద్యులు సరిగ్గా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడమే కారణమన్నారు. 104కి ఫోన్ చేస్తే నాలుగు నెలల నుంచి జీతాల్లే‌వనే సమాధానం వస్తోందన్నారు. 108కి ఫోన్ చేస్తే ఇరవై నిమిషాల్లో రావాల్సిన అంబులె‌న్సు గంట దాటినా వస్తుందో లేదో అనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు లేకుండా చేస్తానన్నారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి క‌ట్టిస్తానన్నారు. హైదరాబాద్‌ను మించిన రాజధాని నగరాన్ని తయారు చేసుకుని 20 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు కడతా‌నన్నారు. వీటన్నింటినీ కలిపి యూనివర్సిటీగా ఏర్పాటుచేస్తానని‌, వైయస్ఆర్ గర్వపడేలా ఆరోగ్యశ్రీని గొప్పగా చేసి చూపిస్తానన్నారు.

రాష్ట్రంలో ఎన్నిగంటలు విద్యుత్‌ కోత ఉందో అర్థంకావడంలేదని శ్రీ జగన్‌ విచారం వ్యక్తంచేశారు. అన్నదాతలకు ఏడు గంటల విద్యుత్ అందడం లే‌దన్నారు. ఈ పరిస్థితిని మారుస్తానని, 2019నాటికి కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా మా‌రుస్తానన్నారు. ప్రతి రైతన్నకు ఏడు గంటల నాణ్యమైన విద్యుత్ పగటిపూ‌టే సరఫరా చేస్తానన్నారు. స్కూళ్ల వద్ద బెల్టుషాపుల వల్ల పిల్లలు చెడిపోతున్నారని, అధికారంలోకి వచ్చాక ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కేవలం నియోజకవర్గానికి ఒక్కటే దుకాణం పెడతామన్నారు. అది కూడా రేట్లు షాక్ కొట్టేలా ఉంటా‌యన్నారు. చదువుకుంటున్న, చదువు పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగం విషయంలో భరోసా ఇస్తున్నానన్నారు. చంద్రబాబులా తాను అన్నికోట్ల ఉద్యోగాలు ఇస్తా అని అబద్ధం ఆడనన్నారు. ఆయన కన్నా మంచి పాలనతో ప్రతి విద్యార్థినీ ఆదుకుంటానని, ఉద్యోగానికి భరోసా ఇస్తానని శ్రీ జగన్‌ చెప్పారు.

Back to Top