ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదు

హైదరాబాద్, 6 మే 2013:

ప్రజాసేవకులకు చిత్తశుద్ధి ఉండాలని, ప్రజలకు మేలు చేయాలన్న వజ్ర సంకల్పం ఉండాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ పేర్కొన్నారు. అవి దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిలో ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందని ఆమె వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌ సోమవారం సాయంత్రం శ్రీమతి విజయమ్మ సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్‌లోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి శ్రీమతి విజయమ్మ ప్రసంగించారు.
మహానేత వైయస్‌ఆర్‌ మాదిరిగానే‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి కూడా జనరంజకమైన పరిపాలన అందిస్తారని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. వైయస్‌ఆర్‌ మీద ఉన్న అభిమానంతో జగన్‌బాబుకు మద్దతుగా నిలిచిన 33 మంది ఎమ్మెల్యేలనూ పార్టీ కాపాడుకుంటుందని ఆమె చెప్పారు. మహానేత వైయస్‌ఆర్‌ రెక్కల కష్టంతో వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం ఆయన ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందని విమర్శించారు. వైయస్‌ఆర్‌ పథకాలు ఏవి అమలు కావడంలేదో చెప్పాలంటూ సిఎం కిరణ్‌, కాంగ్రెస్‌ మంత్రులు, పిసిసి చీఫ్‌ బొత్స ప్రశ్నిస్తుండడాన్ని శ్రీమతి విజయమ్మ ఖండించారు. వారి ప్రశ్నకు రాష్ట్రంలోని ప్రతి గడపా సమాధానం చెబుతుందని అన్నారు. గతంలో మహానేత వైయస్‌ఆర్‌ ప్రతి కుటుంబానికి 30 కిలోల 2 రూపాయల బియ్యం, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడ అమలవుతున్నాయని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. కిలో ఒక్క రూపాయికే బియ్యం ఇస్తున్నామని సిఎం కిరణ్‌ గొప్పగా చెబుతున్నారని ఆయన ఇచ్చే అరకొర బియ్యంతో నెలంతా ఎలా గడుస్తుందన్నారు. ఆపైన కొనుక్కునే 10 కేజీల బియ్యానికి కిలో రూ. 40 చొప్పున మొత్తం రూ. 400 అదనపు భారం పడుతుందన్నారు.

తాను చెప్పినవీ, చెప్పనివీ కూడా చేసి చూపించానని మహానేత వైయస్‌ఆర్‌ సగర్వంగా చెప్పుకున్నారని శ్రీమతి విజయమ్మ గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో ఉరితాంధ్రప్రదేశ్‌గా మారిన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా వైయస్‌ చేశారని అన్నారు. చార్జీలు, ధరలూ పెంచకుండా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆయన అమలు చేశారన్నారు. మహానేత వైయస్‌ సిఎం కాగానే ఉచిత విద్యుత్‌ ఫైలుపై తొలి సంతకం చేసిన సందర్భాన్ని గుర్తుచేశారు. రైతు సంక్షేమానికి ఆయన ఎన్నో చేశారన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్‌, ఆరోగ్యశ్రీ, 108 వాహనం, కిలో రెండు రూపాయల బియ్యం, పావలావడ్డీ రుణాలు అమలు చేశారన్నారు. అవసరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలు అందేలా ఆ మహానేత కృషి చేశారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి మహానేత వైయస్‌ రూ. 200 కోట్లు ఇచ్చారని తెలిపారు.

ఇప్పటి ప్రభుత్వం ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని శ్రీమతి విజయమ్మ నిలదీశారు. లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా ఎందుకు కిరణ్‌ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని ప్రశ్నించారు. కరెంటు లేక రాష్ట్రం అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. పరిశ్రమలు మూతపడి లక్షలాది మంది కార్మికులకు ముద్ద దొరకని దుస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు మద్యం ఏరులై పారుతోందని విచారం వ్యక్తంచేశారు. భూముల ధరలు తగ్గిన రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచి ఈ ప్రభుత్వం దండుకుంటోందని దుయ్యబట్టారు. అమ్మహస్తం పేరుతో కిరణ్‌ ప్రభుత్వం ఇస్తామన్న 9 సరుకులు ఇవ్వడంలేదని ఆరోపించారు.
విద్యుత్ చార్జీలను ఈ ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పెంచుకుంటూపోతోందని..‌ అప్పటి చంద్రబాబు పాలన, నేటి కిరణ్ పాలన ఒ‌కేలా ఉన్నాయని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన అమ్మ హస్తం కాదది మాయహస్తం పథకమని ‌ఆమె విమర్శించారు. ఏ కోర్టు చంద్రబాబును నిర్ధోషి అని తేల్చిందని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు భూములను ధారాదత్తం చేశారని.. ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలను కట్టబెట్టారని, విచారణలు జరగకుండా స్టేలు తెచ్చుకుంటున్నారని శ్రీమతి విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభ ప్రారంభానికి ముందు శ్రీమతి విజయమ్మ మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సభకు పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్‌, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ బహిరంగ సభకు అభిమానులు పోటెత్తారు.

Back to Top