అవినీతి ముఖ్యమంత్రి వల్లే

గుంటూరు: చంద్రబాబు, ఆయన తనయుడు లోకే శ్‌లు మద్యం, మైనింగ్‌, ఇసుకలను ప్రధాన ఆదాయ వనరులుగా మార్చుకుని కోట్లు గడిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే పెద్ద అవినీతిపరుడు కావడంతో ప్రభుత్వ శాఖలన్నీ లంచాల శాఖలుగా మారిపోయాయని ధ్వజమెత్తారు.  విజయవాడలోని స్వర్ణ బార్‌లో జరిగిన కల్తీ మద్యం ఘటనకు  ప్రభుత్వమే పూర్తిగా నైతిక బాధ్యత వహించాలన్నారు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్ట్ షాపులు రద్దు చేస్తానని మొదటి సంతకం చేసిన చంద్రబాబు...రద్దు చేయకపోగా అంతకు మించి మద్యాన్ని అమ్ముతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వం విచ్చలవిడిగా రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తుందని విమర్శించారు. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర తన పదవికి రాజీనామా చేయాలని అంబటి డిమాండ్ చేశారు. విజయవాడ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున ఎక్స్‌గేషియా ప్రకటించాలన్నారు. బాధితులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.
Back to Top