అన్నదాతల ఆత్మాభిమానాన్ని కించపరచ వద్దు

హైదరాబాద్, 5 నవంబర్ 2013:

ప్రపంచ వ్యవసాయ సదస్సులో రైతు సంఘం నాయకులకు అవమానం జరిగిందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీన‌ర్‌ ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. రైతు సంఘం నాయకులకు డెలిగేట్ పా‌స్ ఉన్న‌ప్పటికీ పోలీసులు లోపలికి అనుమతించకపోవడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా ‌సోమవారంనాడు ఈ సదస్సు ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ‌మంగళవారంనాడు నాగిరెడ్డి మాట్లాడుతూ... అన్నదాతల ఆత్మాభిమానాన్ని కించపరచవద్దని ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

రైతుల పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వం రైతులనే అవమానించడం సరైన పద్ధతి కాదని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. తమది రైతు ప్రభుత్వం అని కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటున్నారని, రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు లేకుండా వ్యవసాయ సదస్సేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం, కర్నూలు, గుంటూరు, ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి సుమారు 50 మంది రైతులు వచ్చినా లోనికి అనుమతించలేదన్నారు. వాళ్ళను తీసుకుని తాను వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరకు వెళితే దురుసుగా మాట్లాడడమే కాకుండా ఒక రైతును బయటికి పొమ్మని అవమానించారన్నారు.

రైతు సదస్సు పేరుతో బహుళ జాతి సంస్థలు నిర్వహించుకుంటున్న సదస్సుగా ఉందని నాగిరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం గాని, భారత వ్యవసాయ పరిశోధన కౌన్సిల్‌ గాని లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వమూ స్పాన్సర్‌ చేయలేదన్న విషయాన్ని తెలిపారు. ప్రపంచ వ్యవసాయ సదస్సు పేరుతో రూ.2.50 కోట్ల మేర ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారికంగా తనను ఆహ్వానించారని, అయినా కారు పాసు లేదని సాకు చూపించి తనను కూడా పోలీసులు సదస్సు లోపలికి అనుమతించకపోవడం అత్యంత దారుణమని నాగిరెడ్డి అసహనం వ్యక్తంచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్‌గా ఉన్నందుకే గడచిన 30 ఏళ్ళుగా రైతు నాయకుడిగా ఉండి, ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందుకున్న తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Back to Top