దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలి..?

  • మహానాడు పేరుతో ప్రభుత్వధనం దుర్వినియోగం చేశారు
  • మూడు రోజుల సమావేశాల వల్ల ప్రజలకు జరిగింది శూన్యం
  • రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాల్లో లోకేష్ పాత్ర ఉంది
  • సీబీఐ ఎంక్వైరీ వేయించుకొని విచారణ ఎదుర్కొనే దమ్ము మీకుందా..?
  • వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రతి సవాల్
విశాఖపట్నంః మూడు రోజుల పాటు జరిగిన మహానాడులో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారే తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అధికార టీడీపీపై మండిపడ్డారు. రైతులు, మహిళలు, యువకులు అన్ని వర్గాల ప్రజలు మహానాడులో తమకు మేలు చేసేవిధంగా నిర్ణయాలు తీసుకుంటారేమోనని ఎదురుచూశారని...కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయని అన్నారు. మహానాడులో టీడీపీ నేతలు ఒకరిని ఒకరు పొగుడుకోవడం, ఎదుటివారిని తిట్టడం తప్ప ప్రజలకు జరిగిన ప్రయోజనమేమీ లేదని బొత్స పేర్కొన్నారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అవినీతిపై జగన్ చర్చకు సిద్ధమా అని లోకేష్ మాట్లాడుతున్నారని...ముందు నీపై వచ్చిన అవినీతి ఆరోపణలను నిరూపించుకొని మాట్లాడాలని లోకేష్ కు హితబోధ చేశారు. మహానాడు పేరుతో మూడు రోజుల పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి జాతర చేసుకున్నారే తప్ప, చంద్రబాబు ప్రజలకు చేసింది శూన్యమని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలని బొత్స సూచించారు. 

మూడేళ్లలో ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ప్రజలు పడుతున్న ఇక్కట్లపై మహానాడులో చర్చించకపోవడం దారుణమన్నారు.  తెలంగాణలో ప్రభుత్వం అలసత్వం వహించిందని మాట్లాడుతున్నారని,  మరి ఇక్కడ మీరు చేస్తున్నదేంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఒక్కపంటకైనా గిట్టుబాటు ధర ఉందా..? మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రూ. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. కనీసం దానిపై చర్చిస్తారనుకుంటే అదీ లేదని ప్రభుత్వ తీరును బొత్స ఎండగట్టారు.  ఎదుటివారిపై నిందలు వేయడం, వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయిందని బొత్స ధ్వజమెత్తారు. ఆయన కొడుకు కూడ తండ్రిలాగే తయారయ్యాడని ఫైర్ అయ్యారు.  పిల్లకాకి కావ్ కావ్ అని అరుస్తోందని లోకేష్ పై సెటైర్లు వేశారు. 

 రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఆరోపణలు వస్తే దాన్ని నిరూపించుకోవడానికి విచారణను ఎదుర్కోవాలన్నారు. అప్పుడే రాజకీయాలకు విలువ ఉంటుందని బొత్స  అన్నారు. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్, పరిటాల హత్య కేసులో చంద్రబాబు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే అన్నింటిపైనా ధైర్యంగా వైయస్ఆర్ సీబీఐ ఎంక్వైరీ వేశారని గుర్తు చేశారు.  మూడింటిలోనూ ప్రభుత్వానికి, మంత్రులకు ఎలాంటి ప్రమేయం లేదని వచ్చిందన్నారు.   ఆ రకంగా నీవు విచారణ వేసుకొని నిజాయితీని నిరూపించుకోవాలని బొత్స లోకేష్ కు ప్రతిసవాల్ విసిరారు. సదావర్తి భూముల కుంభకోణం,  వైజాగ్ లో ఉన్న  కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను నీ తాలూకా చుట్టాలు, పక్కాలకు ధారాదత్తం చేసిన స్కాంలో,  జెన్ కో లోని బొగ్గు, కరెంట్ కుంభకోణాల్లో లోకేష్ ప్రమేయం ఉందని సీబీఐ ఎంక్వైరీ వేయాలని తాము డిమాండ్ చేస్తే ప్రభుత్వం దేనికి ముందుకు రాలేదని బొత్స ఎద్దేవా చేశారు. ఉత్తర కుమారుడి లాగ ప్రగల్భాలు పలకడం కాదని..మీకు దమ్ముంటే, నిజాయితీపరులైతే సీబీఐ ఎంక్వైరీ వేసి నిరూపించుకోవాలన్నారు. 

మహానాడులో ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే బాగుండేది. ఇకపై దోపిడీలు చేయమని చెబితే బాగుండేది. ఏమీ చేయకుండానే సవాల్ అని మాట్లాడమేంటని బొత్స నిప్పులు చెరిగారు.  సామాన్యుడికి ఇబ్బంది లేకుండా చేస్తామని ఎక్కడైనా చెప్పారా..? కోర్టులకెళ్లి స్టే తెచ్చుకోవడమేనా మీ నిజాయితీ అంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.  భీమునిపట్నంలో జరిగిన భూ కుంభకోణాల్లో మంత్రి ప్రమేయం ఉందని రాష్ట్రమంతా కోడై కూస్తుంటే ఇంకా ఏం మొహం పెట్టుకొని ఆయన ఎదుటివాళ్ల గురించి మాట్లాడుతున్నారని సదరు మంత్రిపై విరుచుకుపడ్డారు. ప్రజలు ఏం చెప్పినా నమ్మి జేజేలు కొడతారనుకుంటున్నారా..?  మీ తాత లాగ నిక్కచ్చిగా ఉండండ నేర్చుకోవాలని లోకేష్ కు హితవు పలికారు. 
మహానాడునుంచి రాష్ట్ర ప్రజానీకానికి ఏం ప్రయోజనం చేకూర్చారు..?  21మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారుగా దానిపై చర్చించారా..?
శాంతిభద్రతల గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు...? పోలీస్ కంటే మన కార్యకర్తలే మిన్న అని నిర్ణయం తీసుకున్నారా...? ఎమ్మెల్యే ఎస్సైని నిర్బంధించొచ్చు, మంత్రి సీఐని తంతా అనొచ్చు, టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీలు ఓ అధికారిని నడిరోడ్డుపై నిలబెట్టొచ్చని నిర్ణయం తీసుకున్నారా..? ఏం నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.  రైతులు మద్దతు ధర లేక అలమటిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి ఏం సందేశం ఇస్తున్నారు. నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్నాయి. మీరేం సందేశం ఇస్తున్నారు.  నిరుద్యోగులు భృతికోసం ఎదురుచూస్తున్నారు . ఏం సందేశం ఇచ్చారు. ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయింది తప్ప మహానాడు వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని బొత్స అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top