ఢిల్లీ ఘటనలు కర్కశం..అమానుషం...

హైదరాబాద్ 22 డిసెంబర్ 2012 : ఢిల్లీలో సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళన చేస్తున్నవారిపై శనివారం పోలీసులు లాఠీలతో విరుచుకుపడడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్.విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఘటనకు కారణమైన మూలాలను అధ్యయనం చేయకుండా, పరిష్కారాల మీద ధ్యాసపెట్టకుండా ప్రజాస్వామ్యవాదుల మీద లాఠీలు ప్రయోగించడం అమానుషమని ఆమె శనివారం ఒక మీడియా ప్రకటనలో విమర్శించారు.
మహిళలు అర్ధరాత్రి కూడా ఒంటరిగా తిరగగలిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు. కానీ ఇవాళ దేశరాజధానిలోనే పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితి లేదు. ఢిల్లీ నడివీధుల్లో నడుస్తున్నబస్సులోనే ఆరు రోజుల క్రితం ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన జరిగిందంటే దేశరాజధానిలో పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమౌతోందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రజాస్వామికంగా నిరసన తెలిపేందుకు అక్కడకు చేరుకున్న యువజనంపై ఢిల్లీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు.
ఢిల్లీలో వైద్యవిద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను విజయమ్మగారు తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
విదేశీవర్తకాన్ని (ఎఫ్‌డీఐ) చిల్లర వ్యాపారంలోకి తీసుకురావడంలోకి అయితే లాబీలు ఉన్నాయిగానీ, మహిళలకు రక్షణ కల్పించడానికి జాతీయపార్టీల్లో ఏ లాబీలు లేకపోవడం శోచనీయం అన్నారు. ఈ ఘటనను ఒక తీవ్రరుగ్మత లక్షణంగా భావించాలని, దేశవ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలను నిరోధించడానికి చట్టాలను పని చేయించే ప్రభుత్వాలు కావాలని విజయమ్మగారు ఆకాంక్షించారు. దేశంలో ఏటా అధికారిక లెక్కల ప్రకారమే 28 వేల మందికిపైగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్నారంటే ఈ అంశం మీద మన చట్టసభలు, పౌరసమాజం ఎంతగానో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా జాతీయ స్థాయిలో చర్యలకు ఉపక్రమించాలని విజయమ్మగారు డిమాండ్ చేశారు.
 


Back to Top