దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదే..!

హైదరాబాద్, 15 మే 2013:

దెయ్యాలు వేదాలు వల్లించడమనే సామెత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అక్షరాల వర్తిస్తుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. బాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో కుంభకోణాలు వెలుగు చూసిన విషయాన్ని గుర్తుచేశారు. ఎన్నో ఆరోపణలు కూడా వచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.  టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఎల్ అండ్ టీ సంస్థ కట్టించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. లోకేశ్‌ చదువులకు సత్యం రామలింగరాజు ఫీజులు కట్టలేదా అని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై వామపక్షాలు పుస్తకాలు ప్రచురించింది వాస్తవం కాదా అన్నారు. ఎంత చేసినా ప్రజలు చంద్రబాబు గతం మరచిపోరని అంబటి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన ప్రసంగం వివరాలు...

అవినీతిపరుడి నోటివెంట నీతులా!

'అవినీతి రహిత భారత దేశాన్ని కోరుకుంటున్నాను.. అవినీతి రహిత దేశం కోసం నేను పోరాడతాను.. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేయాలి.. ఇలా మాట్లాడింది వావిలాల గోపాలకృష్ణయ్య గారో లేక అన్నా హజారేనో కాదు. సాక్షాత్తు అవినీతిమయమైపోయిన పాలనను అందించిన చంద్రబాబు నాయుడు మాటలు. తొమ్మిదేళ్ళ పాలనలో అనేక అవినీతి పనులకు పాల్పడిన వ్యక్తి  అయిన నారా చంద్రబాబు నాయుడు పలుకుతున్న పలుకులు విన్నప్పుడు కొంత నవ్వు.. కొంత బాధ కలుగుతున్నాయి. అవినీతిపరుడైన వ్యక్తి నోటివెంట ఇలాంటి మాటలు వినాల్సిన పరిస్థితి ఆంధ్ర ప్రజానీకానికి వచ్చింది. ఈ నెల 20వ తేదీనుంచి ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడతారట. అన్ని నియోజకవర్గాలలోనూ తిరుగుతాడట. 22, 23 తేదీలలో రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం సమర్పిస్తాడట.

బాబు హయాంలో ఎన్నో కుంభకోణాలు

తొమ్మిదేళ్ళ పాలించిన మీ వైఖరిని ప్రజలు మరిచారని భావిస్తున్నారా!. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయనే సామెత మీకు కచ్చితంగా వర్తిస్తుంది. నీతిమంతమైన పాలన అందించానని చెపుతున్న మీ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయి.. స్టాంపుల కుంభకోణం, నీరు మీరు పేరుతో ఇంకుడు గుంతలతో ఎంత దుర్వినియోగం జరిగింది. ఐఎమ్‌జీకి 50 వేల రూపాయలకి అప్పనంగా భూమిని ఇచ్చిన చరిత్ర నీది. ఈ వ్యవహారంలో ఎన్ని కోట్లు దండుకున్నారు చంద్రబాబు గారు! సీబీఐ విచారణ జరగకుండా నానా తంటాలు పడుతున్నావు. మీ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులకు ప్రతిఫలంగా ఎల్ అండ్ టీ సంస్థ ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నిర్మించి ఇవ్వలేదా? సత్యం రామలింగరాజు ఇచ్చిన సొమ్ముతో మీ అబ్బాయి చదువుకోలేదా? కమ్యూనిస్టు పార్టీలు ప్రచురించిన 'బాబు జమానా.. అవినీతి ఖజానా' అనే పుస్తకాన్ని మర్చిపోయావా?


ఎన్నికలను అత్యంత ఖరీదైనవిగా చేసిన ఘనత చంద్రబాబుదే

ఎన్టీ రామారావు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్నికలను అతి ఖరీదైనవిగా చేసింది మీరు కాదా చంద్రబాబూ? అధికారం నిలుపుకోవడానికి కోటాను కోట్ల రూపాయలను నియోజకవర్గాలలో ఖర్చుపెట్టి విషసంస్కృతిని ప్రవేశపెట్టిన చంద్రబాబు ఈరోజు అవినీతి రహిత సమాజం కోసం పోరాడుతాననడం హాస్యాస్పదం. మీతో కలిసి నడవడానికి ప్రజలు చెవిలో పువ్వులు పెట్టుకున్నారనుకుంటున్నారా? రెండు, మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినంత మాత్రాన బాబు మారిపోయారని ప్రజలు అనుకుంటున్నారనుకుంటున్నారేమో!

2014 ఎన్నికలలో ఏదో రకంగా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఆడుతున్న నాటకాలు మరోటి కాదు. మీరు వల్లిస్తున్న వేదాలు ప్రజలు అర్థంచేసుకుంటున్న విషయాన్ని బాబు గమనించాలి. కళంకితమైన మంత్రులను తొలగించాలని ఆయన గవర్నరు గారికి వినతి పత్రం ఇస్తే పట్టించుకోలేదట. గవర్నరు తన విధిని నిర్వహించడం లేదని రాష్ట్రపతిని కలుస్తామనడం హాస్యాస్పదం. అసలు ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వర్తించడంలో ఆయన విఫలమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై తటస్థంగా వ్యవహరించడమే దీనికి తార్కాణం. పైగా విప్ జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం పడిపోకుండా వ్యవహరిస్తూ రాష్ట్రపతి దగ్గరికొచ్చి వీధినాటకాలాడుతున్నావు. మీ నిజస్వరూపం ప్రజలకు తెలుసు. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలూ, ఘోరాలు వారి స్మృతిపథం నుంచి తొలగిపోలేదు. ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడెవరని అడిగితే చంద్రబాబునాయుడు ఫొటోనే చూపిస్తారు.

మంత్రులూ కళంకితులు కారు.. జీవీలు అక్రమమూ కావు!

అనేక కుంభకోణాలను వెలికితెచ్చిన పత్రిక చంద్రబాబు గురించి ఏం చెప్పిందో గుర్తుచేసుకోండి. తన మీద చేసిన వ్యాఖ్యలు కోర్టులను తప్పుపట్టేవిలా ఉన్నాయని బాబు అంటున్నారనీ కానీ తాము అన్నది వ్యవస్థల్ని మేనేజ్ చేయగల సమర్థత ఉందన్నాము తప్ప కోర్టుల్ని మేనేజ్ చేశారని అనలేదు. అవినీతి మంత్రుల్ని కాపాడుతున్నది సీఎమ్మే అయినప్పటికీ ఆ సీఎమ్మును కాపాడుతున్నది బాబే. వారిని తొలగిస్తే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి వారిని కిరణ్ కుమార్ రెడ్డీ, ఆయనను చంద్రబాబూ కాపాడుకుంటున్నారు.  బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీతో విభేదిస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నారు. ఇదంతా వీధినాటకంలా ఉంది. వీటిని ప్రజలు నమ్ముతారనుకోవడం దురదృష్టకరం. కళంకిత మంత్రులని అంటున్న ఆ మంత్రులు కళంకితులు కారు.. వారు జారీ చేసిన 26 జీవోలూ అక్రమమూ కావు. మద్యం స్కామ్, ఏలేరు, తదితర కుంభకోణాలు మరిచిపోయారా. జగన్మోహన్ రెడ్డి సోనియాకు ఎదురుతిరిగారు కాబట్టి ఆయనపై సీబీఐ విచారణ చేపట్టారు. మనం కిరణ్ కుమార్ రెడ్డిని కాపాడుతున్నా కాబట్టి సీబీఐ విచారణ ఉండదని బాబు ధైర్యంగా ఉన్నారు. దీనివల్ల తాను నీతిమంతుడైనట్లు బాబు భ్రమపడుతున్నారు.


బయటకొచ్చారు కాబట్టే జగన్ గారిని వేధిస్తున్నారు

జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవినీతికి పాల్పడనప్పటికీ కాంగ్రెస్ పార్టీనుంచి బయటకొచ్చారని ఆయన్ను వేధిస్తున్నారు తప్ప మరోటి కాదు. ఆయనే తప్పిదానికీ పాల్పడలేదని ప్రజలు భావిస్తున్నారు. చవకబారు మాటలు మాట్లాడటం చంద్రబాబుకు తగదు. కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మలా వ్యవహరిస్తోంది. మోపిదేవిని శ్రీ జగన్ కంటే రెండు రోజుల ముందు అరెస్టు చేయమంటే చేస్తుంది. సబితా ఇంద్రారెడ్డికి సమన్లిస్తే చాలంటే ఆ మేరకు వ్యవహరిస్తుంది. ధర్మాన ప్రసాద్ విషయంలో కూడా అంతే. సుప్రీం కోర్టు కూడా సీబీఐ పంజరంలో చిలక అని వ్యాఖ్యానించడం తెలిసిందే. కళంకిత మంత్రుల దోషులు కారు.. జీవోలు తప్పు కాదు.. రాజకీయంగా శ్రీ జగన్మోహన్ రెడ్డిని వేధించడం కోసం వారిని తప్పు చేసినట్లుగా చూపిస్తున్నారు. ఇదో పొలిటికల్ గేమ్. దీనిగురించి ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజెప్పాల్సిన బాధ్యత వైయస్ఆర్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వ్యత్యాసం ఎలా చూపిస్తున్నారో పదే పదే చెబతున్నాం. ధర్మాన, సబితలను అరెస్టు చేస్తే సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.  

ధర్మాన ప్రసాదరావుగారికో న్యాయం, మోపిదేవి గారికో న్యాయమా! సబితా ఇంద్రారెడ్డి గారికో న్యాయం.. జగన్మోహన్ రెడ్డిగారికో న్యాయమా!!'

తాజా ఫోటోలు

Back to Top