హైదరాబాద్, 20 సెప్టెంబర్ 2012: కేంద్ర ప్రభుత్వం డీజిల్ ధరను పెంచడాన్ని, గ్యాస్ సిలిండర్ల సబ్సిడీపై పరిమితి విధించడాన్ని, రిటెయిల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించడాన్ని నిరసిస్తూగురువారంనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బంద్‌ను విజవంతం చేసింది. బంద్‌ను పురస్కరించుకుని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో రాస్తారోకోలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.<br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల వ్యవహారం, ఎఫ్‌డిఐ అంశాలపై చర్చించాలని శాసనసభలో గురువారంనాడు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమీపంలోని గన్‌పార్కు వద్ద బైఠాయించి, ధర్నా నిర్వహించారు. పెంచిన డీజిల్ ధరను తగ్గించాలని, వంట గ్యాస్ సిలిండర్ల సబ్సిడీపై పరిమితిని ఎత్తివేయాలని, ఎఫ్‌డిఐలను అనుమతించరాదని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన అనంతరం వారంతా మూడవ గేట్ వద్ద ధర్నా చేశారు. పెంచిన డీజిల్ ధరను కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సభలో చర్చించకుండా ప్రభుత్వం వాయిదా నాటకాలతో పారిపోతోందని వారు ఆరోపించారు. సభను శుక్రవారానికి వాయిదా వేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని వైయస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అయితే, ధర్నా చేస్తున్న వీరిని పోలీసులు బలవంతంగా తమ వాహనాల్లో తీసుకుపోయి నాంపల్లి పోలీస్ స్టేషన్ వద్ద విడిచిపెట్టారు.<br/><br/>పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఖమ్మం జిల్లా, కడప, పులివెందుల, మెదక్ జిల్లా గజ్వేల్, హిందూపురం, గుంటూరు, నర్సరావుపేట, రాజంపేట తదితర చోట్ల పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. విశాఖపట్నంలో వైయస్ఆర్ సిపి ర్యాలీ, ధర్నాల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాల్ఫిన్ జంక్షన్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎల్ఐసి జంక్షన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వారు వినతిపత్రాన్ని అందించారు. అనంతపురం, తిరుపతిలలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలు ఖాళీ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. వాహనాలకు తాళ్ళు కట్టి లాగి నిరసనలు వ్యక్తం చేశారు. అనేక చోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేశారు. పార్టీ నాయకులు అంబటి రాంబాబు, ముక్కు కాసిరెడ్డి ఇంకా పలువురు నాయకులు ఆటోలకు తాళ్ళు కట్టి లాగారు.<br/>కాగా, బంద్, నిరసనలు, రాస్తారోకోల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా పులివెందులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించి, ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. రాజంపేటలో మానవహారం నిర్వహించారు. హైదరాబాద్‌లో పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడంతో పాటు సిఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మొత్తం మీద గురువారంనాటి బంద్ విజయవంతం అయిందని పార్టీ ప్రకటిచింది. బంద్, ఆందోళనల్లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.