పచ్చచొక్కాల ఇసుక మాఫియా

టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గోదారి ఇసుక నుంచి నిత్యం సొమ్ములు పిండుకోవడం మరిగిన కొందరు ఏటిపట్టు పెద్దలు.. ఇప్పుడు ఉచిత ఇసుక పథకాన్నీ తమ రాబడికి రాచమార్గంగా మార్చేసుకున్నారు. తాము తవ్విందే రేవు, చెప్పిందే రేటు అన్నట్టు ఏటిపట్టు పరీవాహక ప్రాంతం లో ఇసుకను దోచేస్తున్నారు. ఒకప్పటిలాగే ఇప్పుడూ ఇక్కడి నుంచి నిత్యం దాదాపు 1,500 వాహనాల్లో ఇసుక తరలిపోతోంది. ఇసుక రేవుల నుంచి ట్రాక్టర్లపై, ఆపై లారీల్లోకి మార్చి దూరప్రాంతాలకు తరలించి భారీ ధరకు విక్రయిస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలు కావడమేగాని ఏ అధికారీ  చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి ఎడమగట్టును ఆనుకుని సీతానగరం మండలంలో ఉన్న వ్యావసాయక ప్రధానమైన గ్రామాలను ‘ఏటిపట్టు’గా వ్యవహరిస్తుంటారు. ఉచిత ఇసుక పథకం పేదలకు మేలు చేయకపోగా యథాప్రకారం పచ్చచొక్కాల జేబులు మాత్రం తేర సొమ్ము తో పుష్కలంగా నిండుతున్నాయి. నిత్యం గోదావరి కడుపును కొల్లగొట్టి, ‘పచ్చ’ ప్రజాప్రతినిధుల నుంచి అధికారుల వరకూ కోట్లు దండుకుంటున్నారు. 
Back to Top