కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడ రావు

  • ప్రసంగంతో తన స్థాయిని దిగజార్చుకున్న రాహుల్‌
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ రాని దుస్థితికి దిగజారడం ఖాయమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు సభలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినట్లుగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్టీ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.  ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి రాహుల్‌కు ఏమాత్రం తెలియదన్న నిజాన్ని గుంటూరు సభలో ఆయన ప్రసంగం ద్వారా మరోసారి నిరూపణ అయ్యిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కూడా మౌనంగా ఉందని, మోడీ ప్రభావం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉందని మాట్లాడడం రాహుల్‌గాంధీ అజ్ఞానం అన్నారు. కనీసం ఇక్కడి తన పార్టీ శ్రేణులతో చర్చించి రాష్ట్ర పరిణామాల్ని తెలుసుకొని రాహుల్‌ మాట్లాడాల్సిందని హితవుపలికారు. తెలుగుదేశం పార్టీతో కలిసిపోయి రాష్ట్రాన్ని విడగొట్టినందుకు పశ్చాత్తాపాన్ని వ్యక్త పరిచివుండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విడగొట్టినందుకు గానూ రాష్ట్రంలో 175 స్థానాలకు ఒకే ఒక్క చోట కేవలం డిపాజిట్‌ మాత్రమే కాంగ్రెస్‌కు దక్కిందని రాహుల్‌ గమనించాలన్నారు. ప్రత్యేక హోదా, నిధుల విషయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద అసత్యాలు మాట్లాడి రాష్ట్రంలో తన పార్టీ స్థాయిని రాహుల్‌ మరింత దిగజార్చారన్నారు. 

హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడాం..
ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సభకు హాజరుకావాలని ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి ఆహ్వానం పంపించారని అంబటి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం గత మూడేళ్లుగా రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఒక్కటి కాదు.. రెండు కాదు.. అనేక నిరసనలు, ఆందోళనలు, విజ్ఞాపనలు, దీక్షలు చేసిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మాత్రమే అన్నది దేశ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అన్నారు. ఈ విషయంలో రాహుల్‌గాంధీ విమర్శలకు ఎలాంటి విలువా లేదన్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు జాతీయ స్థాయిలోనూ వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి కారణమైన దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరును కూడా పలకకుండా ప్రసంగం చేశారంటే రాహుల్‌ ఆలోచన ఎంత అన్యాయంగా ఉందనేది ప్రజలకు అర్థమవుతుందన్నారు. 

శరద్‌యాదవ్‌ టీడీపీ కళ్లతో చూడడం వల్లే...
ప్రధానికి, ఒక రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకుడికి మధ్య భేటీని శరద్‌యాదవ్‌ వంటి పెద్ద నాయకులు తెలుగుదేశం కళ్లతో చూడడం వల్లే రాహుల్‌ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలే అజెండాగా వైయస్‌ జగన్‌ ప్రధానిని కలిశారన్నారు. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి విషయానికి వస్తే, గతంలోనూ, ఈసారి కూడా అధికార పార్టీ అభ్యర్థి గెలుపు ఎలాగూ ఖాయం అనుకుంటున్నప్పుడు, రాజ్యాంగ అధినేత పదవికి పోటీ పెట్టకపోవడమే సబబు అని వైయస్‌ జగన్‌ భావించారన్న నిజాన్ని రాహుల్‌ తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. 
Back to Top