గజనీలా మారి చంద్రబాబు నిందలు

హైదరాబాద్ 02 అక్టోబర్ 2013: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడిపై అవాకులు చెవాకులూ మాట్లాడిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పడు ఢిల్లీలో ఆయన పక్కనే కూర్చోవడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవికే అర్హుడు కాదనీ, బీజేపీతో తాను తెంగతెంపులు చేసుకోవడానికి ఆయనే కారణమనీ, మళ్ళీ జీవితంలో ఆయన ముఖం చూడననీ చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌లో తన మాటలు ఎవరూ నమ్మరని భావించిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మాట్లాడిన మాటలను ఆమె ఎద్దేవా చేశారు.

గాంధీ జయంతి రోజున చంద్రబాబు చెప్పిన అబద్ధాలను చదవాల్సిన పరిస్థితి తెలుగు ప్రజలకు పట్టిందని ఆమె చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాంను కట్టింది, ఎత్తు పెంచింది దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలోనేననీ చంద్రబాబు చెప్పడం శోచనీయమన్నారు. ఎగువ రాష్ట్రాలు కృష్ణా నదిపై ప్రాజెక్టులన్నీ వైయస్ఆర్ హయాంలోనే కట్టాయని తెలపడాన్ని మించిన అబద్ధం మరొకటి లేదన్నారు. 2003 జలై 19న తెలుగు పార్టీ గెజిట్ లాంటి ఈనాడులో ప్రచురితమైన 'ప్రతి చినుకు.. ఆలమట్టిలోకే..' అనే వార్త దీనికి ప్రబల నిదర్శనమన్నారు. ప్రజలు వెర్రివాళ్ళనుకుని చంద్రబాబు చెప్పే అబద్ధాలను తెలియజెప్పడానికి ఈ విషయాన్ని గుర్తుచేయాల్సి వస్తోందని చెప్పారు. చంద్రబాబు పెద్ద గజినిలాగా మారారు కనక ఈ వార్తను ప్రస్తావిస్తున్నామన్నారు. 2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆలమట్టి ఎత్తు పెంచడం గురించి వచ్చిన వార్త ఇదని వివరించారు. 2003 జూలై 5న ప్రచురితమైన 'ఆంధ్ర  నెత్తిన కర్ణాటక బండ' అని, అదే నెల 23న మరో జల చౌర్యం శీర్షికనా ఈనాడులోనే వార్తలు ప్రచురితమయ్యాయనీ చెబుతూ సంబంధిత వార్తలను వాసిరెడ్డి పద్మ చూపించారు.

కర్ణాటక, మహారాష్ట్ర 2003లోనే రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రాజెక్టులను కడుతున్నారనీ, ఎత్తు పెంచుకుంటున్నారనీ ఈనాడు వార్తలు ప్రచురించిన విషయాన్ని ఆమె ప్రసావిస్తూ.. ఆ సమయంలో చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. దీనిని మరిచి దివంగత మహానేత హయాంలో వీటి నిర్మాణం జరిగిందనీ, ఎత్తు పెంచారనీ చంద్రబాబు చెప్పడాన్ని నిలదీశారు. మన రాష్ట్రానికి జలవనరులు రాకుండా చేసిన పాపం చంద్రబాబుదేనని ఆమె స్పష్టంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ కాల పరిమితి ముగుస్తుండడంతో ఎగువ రాష్ట్రాలు జలవనరులను ఉపయోగించుకోవడానికి ప్రాజెక్టులు కట్టుకుంటుంటే మన రాష్ట్రంలో అలాంటి ప్రయత్నమేమీ చేయకుండా..బచావత్ కేటాయింపులను వినియోగించుకోకుండా నిర్లక్ష్యం చేయలేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పులిచింతల, పోలవరం లేదా మరే ఇతర చిన్న నీటి ప్రాజెక్టయినా కట్టాలని చంద్రబాబుకు ఎందుకు తట్టలేదని ఆమె నిలదీశారు. ప్రాజెక్టులు కట్టద్దని ఆ సమయంలో కేంద్రం మిమ్మల్నేమైనా ఆదేశించిందా  అని అడిగారు. కేవలం ఇంకుడు గుంతలు మాత్రమే కట్టాలని ఎవరైనా చెప్పారా అన్నారు. నీటి కేటాయింపుల వాటాను దక్కించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా... ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకున్న చంద్రబాబు కృష్ణా డెల్టాలో మొదటి పంటకు కూడా నీరివ్వలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టారని విమర్శించారు.

కృష్ణా డెల్టా ఎడారయ్యిందని ఆయన ఈరోజు మాట్లాడుతుండటం శోచనీయమన్నారు. ప్రజలు మరిచిపోయారని చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు.

Back to Top