రైతుల భూములతో బాబు రియలెస్టేట్‌ వ్యాపారం

  • పారిశ్రామిక వేత్తలకు కారుచౌకగా భూకేటాయింపులు
  • ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కోట్లు దోచుకుంటున్న సర్కార్‌
  • భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కుతున్న చంద్రబాబు
  • జీఓ 368, 369లతో చంద్రబాబు వ్యాపారం
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మేడితోక అరుణ్‌కుమార్‌
హైదరాబాద్‌: రూ. కోట్లు విలువచేసే రాజధాని ప్రాంత భూములను పారిశ్రామిక వేత్తలకు కారుచౌకగా ఎలా కేటాయిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి మేడితోక అరుణ్‌కుమార్‌ చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వానికి నచ్చిన విధంగా వారికి కావాల్సిన చోట కావాల్సిన రేటుకు భూ కేటాయింపులు జరుగుతంటే దళితులు, బడుగు, బలహీనవర్గాలకు స్థానం ఎక్కడుంటుందని నిలదీశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో అరుణ్‌కుమార్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఆర్‌డీఏ పరిధిలోని 95 శాతం భూములు పారిశ్రామికవేత్తలకు కేటాయిస్తే 5 శాతం భూములను కూడా దళితులకు కేటాయించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలకు రూ. కోట్లకు విక్రయిస్తూ...పారిశ్రామిక వేత్తలకు ఎందుకు రూ. లక్షల్లో భూములు కేటాయింపులు జరుపుతున్నారని ప్రశ్నించారు. ఇదేనా సామాజిక న్యాయం అని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.  

అప్పనంగా భూముల కేటాయింపులు చేస్తున్న చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు సులభ వాయిదాలు, బ్యాంక్‌ల సహకారం ఇస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు వారికి రావాల్సిన స్థలం ఎక్కడుందో కూడా తెలియదన్నారు. ఆ భూమి కూడా వస్తుందో.. రాదోనని అరుణ్‌కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. తన బంధువులు, కోటరీకి భూములు కేటాయిస్తూ రైతులను మోసం చేస్తున్నాడని బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను సింగపూర్‌కు పంపిస్తానని గొప్పలు చెప్పే చంద్రబాబు రాజధాని ప్రాంతంలో 10 అంతస్థుల భవనమైనా నిర్మించాడా అని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానం ప్రకారం పేద ప్రజలకు ఒక్క సెంటు భూమి అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్టీలకు 26 లక్షల ఎకరాలు, ఎస్సీలకు 6 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. 

కేంద్ర ప్రభుత్వాలు ఎంతో కష్టపడి తయారు చేసిన భూసేకరణ చట్టాలను చంద్రబాబు తుంగలో తొక్కుతున్నాడని అరుణ్‌కుమార్‌ మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసిన 368 జీఓ ఆ చట్టాన్ని పాటించిందా అని ప్రశ్నించారు. ప్రైవేట్‌ సంస్థలకు భూకేటాయింపులు చేస్తే 80 శాతం యజమాని అనుమతి, అదే విధంగా ప్రభుత్వ సంస్థలకు ఇస్తే 75 శాతం అనుమతి పొందాలని చట్టం చెబుతుందన్నారు. అవేవీ పాటించకుండా రాజధాని ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి కేవలం రూ. 25 లక్షలకు ఒక ఎకరాను పంపిణీ చేశారని, అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థ న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌కు ఎకరాలకు రూ. 4 కోట్లు వసూలు చేశారన్నారు. జీవీఆర్‌ స్కూల్‌ ప్రైవేట్‌ సంస్థకు రూ. 10 లక్షలకు ఎకరా అమ్మిన చంద్రబాబు, మరో ప్రభుత్వ సంస్థకు రూ. 3 కోట్లకు ఇచ్చారని ధ్వజమెత్తారు. 368 జీవోనే కాకుండా 369 జీవో విడుదల చేసి గతంలో ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూముల విలువలు పెంచే విధంగా చేశారన్నారు. 
Back to Top