పాలనలో విఫలమై చంద్రబాబు జిమ్మిక్కులుహామీలు నెరవేర్చలేక ఎమ్మెల్యేల కొనుగోళ్లుదోచుకో-దాచుకో విధానాన్ని అవలంభిస్తున్న బాబువైఎస్ జగన్ నాయకత్వంలోనే...రాష్ట్రాభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్న ప్రజలుః కోలగట్లహైదరాబాద్ః టీడీపీ అధికారంలోకి వచ్చి 21 నెలలవుతున్నా...ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. పేదవాడికి ఒక్క ఇళ్లు కూడా మంజూరు చేయని దుస్థితిలో టీడీపీ ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అది ఏవిధంగా పేదల కడుపు నింపుతుంది బాబు అని ప్రశ్నించారు. ఇసుకదోపిడీలో టీడీపీ నేతల మధ్య భాగస్వామ్యం కుదరకపోవడం వల్లే ...చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
ముందుగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి చూపెట్టాలని కోలగట్ల బాబుకు సవాల్ విసిరారు. రాష్ట్రానికి అన్ని విధాల అండగా ఉంటామన్న చంద్రబాబు, మోడీలు ఇప్పటికి వరకు రాష్ట్రానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం దురదృష్టకరమన్నారు. 17మంది ఎంపీలున్న టీడీపీ.... రాష్ట్రంలో హామీలిస్తున్నారే తప్ప, ఢిల్లీలో నోరుమెదపడం లేదని దుయ్యబట్టారు. అధికారంలో ఉండి కూడా ఇలా వ్యవహరించడం ఒక్క టీడీపీ ఎంపీలకే చెల్లిందన్నారు. ఓటుకు నోటు కేసునుంటి తప్పించుకోవడానికి చంద్రబాబు రాష్ట్ర పరువును ఢిల్లీలో తాకట్టు పెట్టారని కోలగట్ల విమర్శించారు.
పాలనలో అన్ని విధాలుగా విఫలమైన చంద్రబాబు, దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చాడానికే....వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని కోలగట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కొందరు టీడీపీలో చేరినంత మాత్రాన చంద్రబాబు సీఎం నుంచి పీఎం కాలేరని, వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా పోదని అన్నారు. టీడీపీకి తెలంగాణలో తగిలిన సెగ ఏపీలో కూడా తగులుతుందనే బాబు జిమ్మిక్కులు చేస్తున్నారని కోలగట్ల ఫైరయ్యారు. చంద్రబాబు ప్రజలకు మేలు చేసే పథకాలను పక్కనబెట్టి... టీడీపీలో అంతర్గతంగా ఉన్న దాచుకో-దోచుకో అనే పథకాన్ని మాత్రం సక్రమంగా అమలు చేస్తున్నారన్నారని ఎత్తిపొడిచారు.
రాష్ట్రంలో పెదబాబు దోస్తుంటే - చిన్నబాబు దాస్తున్నారని కోలగట్ల విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ డబ్బులను పంచడానికి తండ్రీకొడుకులు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలను ఎదుర్కొనే సత్తా లేకనే చంద్రబాబు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేస్తానని మాట్లాడుతున్నారని కోలగట్ల తూర్పారబట్టారు . ప్రజాతీర్పును కోరితే టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని... జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వీరభద్రస్వామి తెలిపారు.
ఎన్నికల సమయంలో చాలా మంది టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని కోలగట్ల ప్రకటించారు. అందుకే చంద్రబాబుకు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద నమ్మకం లేక వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వెళ్తున్నామనడంలోనే చంద్రబాబు పరిపక్వత తెలస్తుందని కోలగట్ల అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న బాబు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సమానంగా నిధులు ఇవ్వకుండా...కేవలం టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నట్లు పరోక్షంగా చంద్రబాబే ఒప్పుకున్నారన్నారు.