దేవాలయ భూములపై కన్నేసిన చంద్రబాబు

ఆలయాలకు టీడీపీ హాని చేస్తోంది
మత భావాలపై దాడి చేస్తోంది
కేంద్రం స్పందించి తగు చర్యలు తీసుకోవాలి
టీడీపీ ప్రభుత్వం చేతగాని దద్దమ్మ ప్రభుత్వంఃపార్థసారథి 

హైదరాబాద్ః అభివృద్ధి పేరుతో దేవాలయాలను, మసీదులను కూల్చడం దారుణమని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. హిందూ, మైనారిటీ మత భావాల మీద ప్రభుత్వం దాడి చేస్తోందని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ భూములను మీ పార్టీవాళ్లకు కారుచౌకగా కట్టబెడుతూ...మీ ఆస్తులను కాపాడుకోవడం కోసం దేవాలయాలను కూల్చేస్తారా అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పూజారులను అర్థరాత్రి పూట అరెస్ట్ చేసి మరీ గుళ్లను కూల్చేయడం దుర్మార్గమన్నారు. మత భావాలను ప్రభుత్వం ఏమాత్రం గౌరవించడం లేదని పార్థసారథి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. 

కేవలం టీడీపీ శాసనమండలి సభ్యుడి ఆస్తులను కాపాడడం కోసం గోశాల, గోశాలలోని కృష్ణ ఆలయాన్ని కూల్చేయడం దుర్మార్గమన్నారు.  ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని పార్థసారథి డిమాండ్ చేశారు. ప్రభుత్వ అవసరాల కోసం గోశాల భూములను తీసుకుంటూ, ఇరిగేషన్ భూమిని గోశాలకు అప్పజెప్పారని ...కృష్ణ దేవాలయానికి ఎలాంటి హాని కలిగించమని గోశాల నిర్వాహకులతో ఎంవోయూ కూడా చేసుకున్నారని పార్థసారథి గుర్తు చేశారు.  కానీ ఒప్పందాన్ని ధిక్కరించి ఆలయాన్ని ఏవిధంగా కూలుస్తారని టీడీపీ సర్కార్ పై పార్థసారథి ధ్వజమెత్తారు. ప్రభుత్వం మాటలన్నీ నీటిమూటలేనని ఆయన దుయ్యబట్టారు. 

ఎన్నో శతాబ్ధాల నుంచి అక్కడ కృష్ణ దేవాలయం ఉందని, పూజారులు ఆరాధన చేసుకుంటున్నారని పార్థసారథి తెలిపారు. ప్రజలకు అసౌకర్యంగా లేకపోయినా, అభివృద్ధికి ఎలాంటి ఆటంకంగా లేకపోయినా... మతపరమైన భావాల్ని గౌరవించకుండా ఉద్దేశ్యపూర్వకంగా హాని చేయడం దారుణమని పార్థసారథి ఫైర్ అయ్యారు.  1995‍‍, 2004 మధ్యకాలంలో ప్రభుత్వానికి, కార్పొరేట్ ఇనిస్టిట్యూషన్ కు సంబంధించిన భూములను బాబు స్విస్ ఛాలెంజ్ పద్దతిలో కారుచౌకగా కట్టబెట్టారని, మళ్లీ ఇవాళ అదే పని చేస్తున్నారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములు, కార్పొరేట్ ఆస్తులన్నీ కొల్లగొట్టాక బాబు దృష్టి ఇప్పుడు దేవాలయ భూముల మీద పడిందని ఆయన విమర్శించారు. 

దేవాలయ భూములు అమ్మకూడదు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు కాదని ఆదేశాలు ఉన్నప్పటికీ టీడీపీ నిబంధనలను ధిక్కరిస్తోందన్నారు. మహాత్ములు, పూర్వీకులు దేవాలయాలకు సంబంధించి అప్పగించిన భూములను సైతం టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్లు ఎడాపెడా దేవాలయ భూములను అమ్ముకోవడం తగదని కోర్టులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సదావర్తి సత్రం భూములను ఆక్షన్ వేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ వేలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఉద్దేశ్యపూర్వకంగా దేవాలయ భూములు అమ్మాలని చూస్తోందని పార్థసారథి ఆరోపించారు. సదావర్తి భూములతో పాటు తిరుపతిలో కోట్ల విలువ చేసే సీతమ్మ ట్రస్ట్ భూములను, విశాఖపట్నం సింహాచలం దేవాలయానికి సంబంధించిన భూములను చంద్రబాబు తన సొంత మనుషులకు, పార్టీ వాళ్లకు, ముడుపులు చెల్లించిన వారికి అప్పనంగా ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహించారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీతో పాటు, ముస్లిం, క్రిస్టియన్ సంస్థలకు సంబంధించిన పెద్దలు దీనిపై స్పందించాలన్నారు. 

రామవరప్పాడులో మసీదును కూల్చేసి మస్లిం పెద్దలను అరెస్ట్ చేశారు.  విజయవాడలో 30 గుళ్లను ఉద్దేశ్యపూర్వకంగా కూల్చేశారు. దేవాలయ భూములు, మసీదులకు హాని చేస్తున్న టీడీపీపై తగు చర్యలు తీసుకోవాలని బీజేపీని కోరారు. ఆలయాల కూల్చివేతను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అభివృద్ధి పేరుతో ఇష్టమొచ్చినట్లు మత భావాన్ని రెచ్చగొట్టేవిధంగా, కించపర్చే విధంగా దాడులు చేయడం శోచనీయమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, విభజన చట్టంలోని హామీలను సాధించడంలో టీడీపీ పూర్తిగా వైఫల్యం చెందిందని పార్థసారథి దుయ్యబట్టారు. కేంద్రం కాళ్ల వద్ద సాగిలపడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు.  

Back to Top