ప్ర‌జా ఉద్య‌మాల‌కు సిద్ధం కావాలి

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి పిలుపు 

 ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేత‌ల విస్తృత స్థాయి స‌మావేశం

విజ‌య‌వాడ‌:  కూట‌మి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌జా ఉద్య‌మాల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం కావాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్‌, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.  బుధ‌వారం విజ‌య‌వాడ న‌గ‌రంలో  ఎన్టీఆర్ జిల్లా పార్టీ నేత‌ల విస్తృత స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్య‌క్షులు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రులు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, జోగి ర‌మేష్‌, పార్లమెంట్ పరిశీలకుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్,  మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట   ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,  నేతలు పోతిన మహేష్, పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆసిఫ్ ,  త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ రూపొందించార‌ని తెలిపారు. ఈ నెల 9న వైయ‌స్ జ‌గ‌న్ నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని సందర్శిస్తానని.. అదే రోజు నుంచే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈనెల 10వ తేదీన గ్రామ, వార్డు స్థాయిల్లో రచ్చబండ కార్యక్రమం మొద‌ల‌వుతుంద‌న్నారు. నవంబరు 22 వరకు ఈ కార్య‌క్ర‌మం కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సేకరించే కోటి సంతకాల పత్రాలను నవంబరు 23న నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు, నవంబరు 24న  అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తార‌ని వివ‌రించారు. అనంతరం గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు నివేదిస్తామన్నారు. పార్టీ నాయ‌కులు ఈ ఉద్య‌మాన్ని ముందుండి న‌డిపించాల‌న్నారు. 

మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది:  దేవినేని అవినాష్‌

కూట‌మి నేత‌ల వ‌ద్ద రెడ్‌బుక్ ఉంటే, మా వ‌ద్ద డిజిట‌ల్ బుక్ ఉంద‌ని గుర్తు పెట్టుకోవాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ హెచ్చ‌రించారు. రెడ్‌బుక్ పేజీలు చించితే చినిగిపోతాయ‌ని, డిజిట‌ల్ బుక్‌ను మీరు తాక‌లేర‌న్నారు. విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని చిన్ని బెజవాడ ప్రజలకు ఐపీ పెట్టి పారిపోయిన వ్యక్తి అని విమ‌ర్శించారు. హైదరాబాద్ లో స్కాంలు చేశార‌ని, సొంత అన్న కేశినేని నానిని వెన్నుపోటు పొడిచిన నాయ‌కుడు ఈ చిన్ని అని మండిప‌డ్డారు. కేశినేని నాని అనే వ్యక్తి లేకపోతే కేశినేని చిన్నికి అడ్రస్ కూడా లేదన్నారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో వంద కోట్లు దోచుకున్న దొంగ అని ధ్వ‌జ‌మెత్తారు. వైయ‌స్ జగన్ జోలికి వస్తే ఎంపీ కేశినేని చిన్ని బండారం అంతా బయటపెట్టే బాధ్యత మేం తీసుకుంటామ‌ని సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు.  

కార్యకర్తలు అండగా ఉంటాం: మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
అన్యాయానికి గుర‌వుతున్న వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటామ‌ని మాజీ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  భ‌రోసానిచ్చారు. వైయ‌స్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు పని చేయటానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాల‌ని సూచించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు. వైద్య విద్యను పేదవాడికి దూరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంద‌ని, కల్తీ మద్యం రాష్ట్రంలో ఎక్కువైంద‌ని, ఇదే చంద్రబాబు లిక్కర్ పాలసీ అంటూ ఎద్దేవా చేశారు. 

Back to Top