తాడేపల్లి: బోటు కొనుక్కోవడానికి కన్యాకుమారి వెళ్లి, బోటుతో సహా తిరిగి వస్తుండగా, తమ జలాల్లోకి ప్రవేశించారంటూ కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక కోస్టుగార్డు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో బోటులో చేపలు కూడా లేనప్పటికీ, వారిని శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టడంతో జైలుకు పంపారు. విషయాన్ని ఇక్కడ తమ వారికి తెలియజేయడంతో, వైయస్ఆర్‌సీపీ నాయకుడు, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇక్కడి అధికారులకు పూర్తి వివరాలు చెప్పి, శ్రీలంక అధికారులకు సమాచారం పంపించారు. దీంతో 54 రోజుల తర్వాత కాకినాడకు చెందిన నలుగురు మత్స్యకారులు శ్రీలంక జైలు నుంచి విడుదలయ్యారు. శ్రీలంక జైలు నుంచి తమ విడుదలకు చొరవ చూపించిన ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసిన వారు, మంగళవారంవైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన మత్స్యకారులు పంతాడ బ్రహ్మానందం, పి. శ్రీను.. తాము శ్రీలంక చెర నుంచి వైయస్సార్‌సీపీ చొరవ వల్లే బయటపడినట్లు చెప్పారు. వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.చక్రవర్తి, కృష్ణా జిల్లా మత్స్యకార సంఘం నాయకుడు కోలా హరికృష్ణ తదితరులు వైయస్ జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు.