గుంటూరు: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళ్తుంటే కూటమి నేతలు ఎందుకు భయపడుతున్నారని మాజీ మంత్రి విడదల రజినీ సూటిగా ప్రశ్నించారు. వైయస్ జగన్ పర్యటనలపై పోలీసుల ఆంక్షలను ఆమె తప్పుపట్టారు. ఈ మేరకు బుధవారం విడదల రజినీ మీడియాతో మాట్లాడుతూ..`మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనలను ప్రజల ముందు పెడతారు. మెడికల్ కాలేజీల ఆవశ్యకతను మరోసారి ప్రజలకు వివరించేందుకు వైయస్ జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ ఉండాలన్న ఆలోచనతో వైయస్ జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టింది. కార్పొరేట్ వైద్యం పేదలకు అందాలనే సంకల్పంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. చరిత్రను తిరగరాస్తు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. పేదల వైద్యంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. మెడికల్ కాలేజ్ ని ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగమనే ఆలోచన కూటమి నేతలకు లేదు. కాలేజీకి జీవో లేదు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు అవగాహనతో మాట్లాడాలి. కాలేజీకి అనుమతి లేదంటున్న నాయకులు నర్సీపట్నం వస్తే వారికి మెడికల్ కాలేజీ నిర్మాణం చూపిస్తాం. ప్రధాని మోదీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలని మాట్లాడుతున్నారు. పొత్తులో ఉన్న కూటమి నాయకులు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని వ్యతిరేకిస్తున్నారు. నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ప్రజలకు చూపిస్తే మీకు ఉన్న అభ్యంతరం ఏంటి. మొన్నటి వరకు మెడికల్ కాలేజీ నిర్మాణం లేదని మీరే చెప్పారు. వైయస్ జగన్ పర్యటన ద్వారా మెడికల్ కాలేజీ నిర్మాణం బయటపడుతుందని భయపడుతున్నారా?` అని విడదల రజినీ ప్రశ్నించారు.