చంద్రబాబు కులవివక్ష

  • బాబు పాలనలో దళితులకు తీరని అన్యాయం
  • దళిత జాతిని అవమానిస్తున్న చంద్రబాబు
  • ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి
  • వైయస్ఆర్ పాలనలో అగ్రగాములైన దళితులు
  • పేదల కడుపుకొట్టి పెద్దలకు దోచిపెడుతున్న చంద్రబాబు
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం
హైదరాబాద్ః చంద్రబాబు పాలనలో దళితులకు తీరని అన్యాయం జరుగుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. దళిత జాతిని చంద్రబాబు అవమానిస్తున్నారని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కులవివక్ష కొనసాగడానికి కారణం ఆయన ఆలోచన విధానాలేనని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రే సాక్షాత్తు...నేను, వెంకయ్య అమెరికాలో పుట్టాల్సిన వాళ్లం...ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అంటూ పత్రికా సమావేశాల ద్వార ప్రకటించడం అత్యంత హేయనీయమన్నారు. చంద్రబాబు తన మూడేళ్ల పాలన కాలంలో ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు సంబంధించి రాజ్యాంగబద్ధంగా వినియోగించాల్సిన సొమ్మును ఏమాత్రం సక్రమంగా వినియోగించడం లేదని కాగ్ అభ్యంతరం తెలిపిన విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను బాబు  పక్కదారి పట్టిస్తున్నారని కాగ్ స్పష్టం చేసిందన్నారు. హైదరాబాద్ లోని పార్టీకేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  

పెరిగే ఛార్జీలకనుగుణంగా విద్యార్థులకు, అట్టడుగు వర్గాలకు ఎప్పటికప్పుడు మెస్ ఛార్జీలు పెంచుకుంటూపోతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక ఛార్జీలను పెంచకపోగా, ఉన్న హాస్టళ్లను మూసేసే దశకు వచ్చాడని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్ ఏ రోజుకారోజు పెరిగే ధరలను బట్టి మార్పులు చేర్పులుంటాయని ప్రకటనలున్నప్పుడు...పేదవాళ్లు బతకడానికి కావాల్సిన మెస్ ఛార్జీల విషయంలో రూపాయి కూడ పెంపు జరగకపోవడం బాధాకరమన్నారు.  కుటుంబాలు పెరిగినా రేషన్ కార్డుల సంఖ్య పెంచకపోవడం దారుణమని ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు ఐదేళ్లలో 48 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చారని...బాబు వచ్చిన ఈమూడేళ్లలో ఒక్కటంటే ఒక్క ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. వైయస్ఆర్ హయాంలో 31లక్షల ఎకరాల భూమిని పంచితే అందులో దళితులు అగ్రగాములైనారని భూమన చెప్పారు. చంద్రబాబు వచ్చాక వారికి ఒక్క ఎకరా ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. 

ప్రభుత్వ ఖజనా నుంచి పేదలకు అందాల్సిన నిధులను చంద్రబాబు పాలనలో పెద్దలు అందుకంటున్నారని భూమన విమర్శించారు. భవిష్యత్ అవసరాల కోసం వైయస్ఆర్ భూసేకరణ జరిపి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తే ఆ భూములను కూడా చంద్రబాబు దోచేస్తున్నారని నిప్పులు చెరిగారు. పేదల కడుపు కొట్టి చంద్రబాబు పెద్దలకు దోచిపెడుతున్నాడన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరిట చంద్రబాబు 10 లక్షల ఎకరాల భూ సేకరణ చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలోని దళితులంతా నాకు వ్యతిరేకులు కాబట్టి, ఓట్లేయడం లేదు కాబట్టి..వాళ్ల పొలాలను పెద్దలకు పంచితే కమీషన్ల వచ్చి ఎన్నికల్లో డబ్బును వినియోగించి గెలుద్దామన్న దురాశలో బాబు ఉన్నారని భూమన మండిపడ్డారు.  దళితుల పట్ల బాబు ఆలోచన ఈరకంగా ఉంది గనుకనే వివక్షాపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.  బాబు పాలనలో దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు,  బలహీన వర్గాలకు 10వేల కోట్లతో ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మూడేళ్లలో ఒక్క రూపాయి  కూడ కేటాయించిన దాఖలాలు లేవన్నారు. 
Back to Top