చంద్రకిరణ్‌రెడ్డి నాయుడు.. పిట్టకథలు

కైకలూరు (కృష్ణాజిల్లా) : చంద్రబాబుని చంద్రకిరణ్‌రెడ్డి నాయుడిగా ప్రజలు భావిస్తున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఎద్దేవా చేశారు. కలిదిండి మండలం కొండంగిలో సోమవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నాని విలేకరులతో మాట్లాడుతూ... పిట్టకథలు చెప్పుకొంటూ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టిడిపి ఎమ్మెల్యేలు విద్యుత్ సమస్యపై ఐదు గంటల నిరాహార‌ దీక్ష చేయడం హాస్యాస్పదం అన్నారు. పాదయాత్రలో కిరణ్ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా దూషిస్తున్న చంద్రబాబు.. రాత్రయ్యే సరికి సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో తెరచాటు మంతనాలు సాగిస్తున్నారని దుయ్యబట్టారు.

మాటమీద నిలబడే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని నాని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానం కోసం వీరుడిలా నిలిచిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి నిజమైన నాయకుడని ఆయన అభివర్ణించారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి సహకరించని టిడిపి ఎమ్మెల్యేలు.. విద్యుత్ సమస్యపై దీక్ష చే‌యడాన్ని జనం నమ్మే స్థితిలో లేరన్నారు. టిడిపి కనుమరుగయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని నాని పేర్కొన్నారు.
Back to Top