'చంద్రబాబు, కిరణ్‌లది దుష్ట పరిపాలన'

అనంతపురం, 17 జనవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన సువర్ణయుగమైతే చంద్రబాబు, కిరణ్‌ కుమార్‌రెడ్డిలది దుష్టపాలన అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కొండా సురేఖ అభివర్ణించారు. మహానేత వైయస్‌ఆర్ రెక్కల కష్టంతో‌ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని‌ ఆమె గుర్తు చేశారు. ప్రాంతాలు, మతాలు, కులాలకు అతీతంగా రాష్ట్రాన్ని రాజశేఖరరెడ్డి అభివృద్ధి పథంలో నడిపించారని ఆమె అన్నారు. తాడిపత్రిలో రౌడీయిజం రాజ్యమేలుతోందని సురేఖ అన్నారు. మీడియాను కూడా కాంగ్రెస్ నాయకులు బెదరిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీలో ఉంటే వైయస్‌ఆర్‌సిపి అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి మంచివాడు.. బయటకు వస్తే చెడ్డవారు.. కాంగ్రెస్ నైజం ‌ఇలా ఉంది అని కొండా సురేఖ అన్నారు. మహానేత వైయస్‌ఆర్ రుణం తీర్చుకోవాలంటే‌ శ్రీ జగన్‌కు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. శ్రీ జగన్‌ను సిఎంను చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సహకార ఎన్నికల్లో ‌ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కవుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతల దౌర్జన్యాలకు, బెదరింపులకు ఎవరూ భయపడొద్దని కొండా సురేఖ ధైర్యం చెప్పారు.
Back to Top