చంద్రబాబు అజ్ఞానానికి నిదర్శనం

హైదరాబాద్, 05 జూన్ 2013:

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మద్య నియంత్రణ సదస్సులో చేసిన వ్యాఖ్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి ఎద్దేవా చేశారు. మద్య నిషేధాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి తాను అధికారంలోకి వస్తే బెల్టు షాపుల నియంత్రణ ఫైలుపై రెండో సంతకం చేస్తానని అనడాన్ని ఆమె ప్రశ్నించారు. ఆయన అధికారంలో ఉండగా వ్యవహరించిన తీరును ఓ సారి గుర్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం శ్రీమతి శోభ మీడియాతో మాట్లాడారు. బెల్టు షాపులను పరిచయం చేసిందే చంద్రబాబన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎవరూ మరిచిపోలేదన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య, మల్లాది సుబ్బమ్మ వంటి మహామహుల ఆధ్వర్యంలో సాగిన మద్య నిషేధ ఉద్యమాన్ని చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారని చెప్పారు. ఉద్యమ కమిటీ నాయకులను ఆయన మోసం చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధాన్ని ఎలా ఎత్తేయాలనే అంశంపై కమిటీ వేశారనీ.. దీనిని వ్యతిరేకిస్తూ వావిలాల తదితరులు బయటకి వచ్చేశారనీ ఆమె చెప్పారు.

బెల్టు షాపులు అనధికారికమని తెలియవా బాబూ!
తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి బెల్టు షాపులు అధికారికమైనవో అనధికారికమైనవో తెలియవనీ, అనధికారికంగా ఏర్పాటుచేసే ఈ దుకాణాల తొలగింపుపై తాను రెండో సంతకం చేస్తాననీ మద్య నియంత్రణ సదస్సులో చంద్రబాబు ప్రకటించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమనీ శోభా నాగిరెడ్డి మండిపడ్డారు. వాటి రద్దుపై సంతకం ఏరకంగా పెడతారో వివరించాలన్నారు. అధికారానికి తొమ్మిదేళ్ళుగా దూరంగా ఉన్న చంద్రబాబు ఇప్పుడు ప్రతి దానికీ సంతకం పెడతానని అంటున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2003 సంవత్సరంలో రాష్ట్రంలో నలబై వేల బెల్టు షాపులున్నాయనీ, ఈ విషయాన్ని 'ఈనాడు' పత్రికే రాసిందనీ శోభా నాగిరెడ్డి తెలిపారు.

మాటలు మార్చడం బాబుకు అలవాటే
అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. లేనప్పుడు ఒక మాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. అధికారంలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, తగ్గించాలనీ ఆయన డిమాండు చేశారన్నారు. ఆదాయం కోసం మద్యం ధరలను తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని తెలిపారు. ఇప్పడు అధికారంలో లేరు కాబట్టి బెల్టు షాపులు తొలగించాలంటున్నారని చెప్పారు. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా వందలాది బెల్టు షాపులున్నాయనీ, ఏసీబీ నివేదికే దీనికి సాక్ష్యమనీ చెప్పారు.

ప్రజా పోరాటాలను వాడుకునే తత్త్వం జగన్‌కు లేదు
సమస్యలపై సాగే ప్రజా పోరాటాలను రాజకీయ అవసరాలకు వాడుకునే తత్త్వం తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి లేదని శోభా నాగిరెడ్డి స్పష్టంచేశారు. సమస్యల పరిష్కారంలో శ్రీ జగన్‌కు చిత్తశుద్ధి ఉందన్నారు.  ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు, ఉచిత విద్యుత్తు పథకాలను దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రజలు డిమాండ్ చేస్తే పెట్టలేదనీ, ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజల కష్టాలను గమనించి వీటిని అమలు చేశారనీ వివరించారు. ఇలాంటి పక్క రాష్ట్రంలో ఎందుకు లేవని ప్రజలు అడిగేలా ఆయన అమలు చేశారన్నారు. శ్రీ జగన్  తన ఓదార్పు యాత్రలో స్వయంగా ప్రజల కష్టాలు, బెల్టు షాపుల వల్ల కలుగుతున్న నష్టాలు చూసి మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేలా చేస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో ప్రకటించారని ఆమె వెల్లడించారు. బాధ్యత కలిగిన నాయకుడిగా ఆయనీ ప్రకటన చేశారన్నారు. ప్రతి పంచాయతీకి పది మంది మహిళా పోలీసులను నియమించి వారి ద్వారా బెల్టు షాపులను నియంత్రింప చేస్తానని చెప్పారన్నారు.

రాష్ట్రానికి వెయ్యి మద్యం దుకాణాలు మాత్రమే ఉండాలని చంద్రబాబు మద్య నియంత్రణ సదస్సులో డిమాండ్ చేసిన విషయాన్ని శోభా నాగిరెడ్డి ప్రస్తావిస్తూ.. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ నియోజకవర్గానికి ఒక షాపు మాత్రమే ఉండాలని పార్టీ ప్లీనరీలో అభిలషించారన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే యావతో చంద్రబాబు  బాధ్యతారహితంగా మాట్లాడే మాటలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని ఆమె పేర్కొన్నారు. మద్య నియంత్రణ మీద ప్లీనరీలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రెండు లక్షల బెల్టు షాపులున్నాయన్నారు. ప్రతి 70 కుటుంబాలకు బెల్లు షాపు అందుబాటులో ఉందన్నారు. ఆ కుటుంబాలకు స్కూలు కానీ,  ఆస్పత్రి కానీ అందుబాటులో లేవనీ ఇది ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశమనీ తెలిపారు. ఎవరో చెబితే తమ పార్టీ హామీలు ఇవ్వలేదనీ, తమంత తాముగా చేస్తానన్నామనీ శోభ వివరించారు.

Back to Top