'చంద్రబాబూ కపట నాటకాలు కట్టిపెట్టు'

ఒంగోలు (ప్రకాశం జిల్లా): మాట మీద నిలబడే తత్వం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఏనాడూ లేదన్న విషయం మరోమారు రుజువైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విప్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలోని చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచే బిల్లుకు తాము వ్యతిరేకం అని చెబుతూనే అది రాజ్యసభలో నెగ్గేలా పరోక్షంగా మద్దతు ఇవ్వడం ఆయన తీరుకు తాజా ఉదాహరణ అన్నారు. మాట తప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఎఫ్‌డిఐలపై ఓటింగ్ జరి‌గినప్పుడు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పిన చంద్రబాబు మాట తప్పారని, టిడిపి ఎంపిలు రాజ్యసభలో వ్యవహరించిన తీరే దీన్ని స్పష్టం చేసిందన్నారు.

ఎఫ్‌డిఐల మీద రాజ్యసభలో ఓటింగ్‌ సమయంలో సభ నుంచి గైర్హాజరైన ముగ్గురు టిడిపి ఎంపీలపై ఎందుకు చర్య తీసుకోలేదో ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని బాలినేని నిలదీశారు. వైయస్‌ఆర్‌సిపి ఒంగోలు నగర విభాగం నూతన కమిటీ ప్రకటన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు కపట నాటకాలను కట్టిపెట్టకపోతే... ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మను కలిసినందుకే కొందరు టిడిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు ఆగమేఘాల మీద సస్పెండ్‌ చేసిన వైనాన్ని బాలినేని ప్రస్తావించారు. అయితే, దేశంలోని కోట్లాది మంది చిల్లర వర్తకులు, పనివారి జీవితాలపై తీవ్రమైన దెబ్బకొట్టే ఎఫ్‌డిఐల మీద జరిగిన ఓటింగ్‌కు డుమ్మా కొట్టిన టిడిపి ఎంపిల మీద ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలని చంద్రబాబును బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు.

తాజా వీడియోలు

Back to Top