దోపిడీ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి

తూర్పు గోదావరి జిల్లా: చంద్రబాబు అవినీతి, దోపిడీ పరిపాలనను కూకటివేళ్లతో పెకిలించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మూడేళ్లుగా రాష్ట్రాన్ని అడ్డగొలుగా దోచుకుంటూ ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనాన్ని కూడా నిర్మించలేదని విమర్శించారు. రాజధాని పేరుతో వందల కోట్ల దోచుకుతింటున్నారని ఆరోపించారు. రాజమండ్రి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కో–ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాష్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూమన, జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, కందుల దుర్గేష్‌ పాముల రాజేశ్వరిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ... చంద్రబాబు పరిపాలన మూడు అబద్దాలు, ఆరు దోపిడీలతో విరాజిల్లుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అమరావతి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, రైతుల భూములను విదేశాలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నాడన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, షర్మిలారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top