భూమా శోభా నాగిరెడ్డి కన్నుమూత

హైదరాబాద్‌, 24 ఏప్రిల్ 2014 :

కర్నూలు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత, ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ బంజారాహిల్సులోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె గురువారం ఉదయం 11.05 గంటలకు కన్నుమూశారు.‌ శోభా నాగిరెడ్డి మరణాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. శోభా నాగిరెడ్డి మరణ వార్త తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కర్నూలు జిల్లా ప్రజలు ముఖ్యంగా ఆళ్ళగడ్డ వాసులు కన్నీరు మున్నీరయ్యారు.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలిగా శోభా నాగిరెడ్డి చురుకైన పాత్ర వహించారు. 1968 నవంబర్ 16న‌ ఆమె ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. శోభా నాగిరెడ్డి తన కళ్ళను దానం చేస్తూ గతంలోనే ప్రమాణపత్రం రాసి ఇచ్చారు.

టీడీపీ హయాంలో ఆమె ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శోభా నాగిరెడ్డి రాయలసీమలో బలమైన నేతగా ఎదిగారు. ‌శోభా నాగిరెడ్డి 1996లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి నిలిచారు.

ఆ తర్వాత వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. ‌అతి కొద్ది కాలంలోనే మంచి నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2012లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ‌విజయం సాధించారు. అప్పటి నుంచి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటి వరకూ శోభా నాగిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మళ్ళీ ఆళ్ళగడ్డ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

బుధవారం రాత్రి 11.30 గంటల‌ సమయంలో ప్రమాదానికి గురైన శోభా నాగిరెడ్డి సుమారు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడారు. చివరకు ఓడిపోయారు. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్న ఎంతో మందిని కాపాడి ప్రాణాలు పోసిన అత్యంత నిపుణులైన కేర్ ఆస్పత్రి వైద్యులు ఎంతగా ప్రయత్నించినా, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండి,‌ చికిత్సకు ఆమె శరీరం కూడా  ఏమాత్రం స్పందించలేదు. అన్ని రకాలుగా ప్రయత్నించిన తర్వాత ఇక ఫలితం లేకపోవడంతో ఆమె మరణించినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు అధికారికంగా ప్రకటించారు.

తన నియోజకవర్గంలో ప్రచారం ముగించుకుని,‌ బుధవారం రాత్రి తిరిగి ఇంటికి వెళ్తుండగా వేగంగా వెళ్తున్న వాహ‌నాన్ని డ్రైవర్‌ రోడ్డు మీదే ఉన్న ధాన్యం రాసిని తప్పించడానికి ఒక్కసారిగా సడన్ బ్రే‌క్ వేయడంతో నాలుగు పల్టీలు కొ‌ట్టింది. కారు నుంచి బయటపడిన శోభా నాగిరెడ్డి తలకు బలమైన గాయాలు తగలడం, వెన్నెముక, పక్కటెములకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. మెదడుకు సైతం గాయాలు కావడంతో ఆమె ముక్కు, చెవుల్లోంచి కూడా రక్తస్రావం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
శోభా నాగిరెడ్డి ఇక లేరన్న విషయాన్ని కేవలం కర్నూలు జిల్లా వాసులు మాత్రమే కాదు.. యావత్ ఆంధ్రదేశ ప్రజలు తల్లడిల్లిపోయారు. ఏ సమయంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించే నాయకురాలు ఇక లేరని తెలిసి అభిమానులు తల్లడిల్లిపోయారు. కేర్ ఆస్పత్రి ప్రాంగణం మొత్తం ఆమె అభిమానులతో కిటకిటలాడింది.

విజయమ్మ కన్నీరు మున్నీరు :

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న‌ శ్రీమతి వైయస్ విజయమ్మ తన ప్రచారాన్ని నిలిపివేసి, హుటాహుటిన రాజమండ్రి నుంచి విమానంలో బయల్దేరి హైదరాబాద్‌ కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. నిరంతరం తనకు కుడి భుజంగా మెలగిన శోభా నాగిరెడ్డిని తలుచుకుని కన్నీరు మున్నీరయ్యారు. శోభా నాగిరెడ్డి అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం ఆళ్ళగడ్డలో జరుగుతాయని వైయస్ఆర్‌సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ తెలిపారు.

అక్కలాంటి శోభ: వైయస్ జగన్‌ తీవ్ర విచారం

శోభా నాగిరెడ్డి తనకు అక్క లాంటి వారని, ఆమె అడుగడుగునా కష్టసుఖాల్లో తన వెంట నడిచారని, తన నీడలా వెన్నంటి ఉండి పార్టీకి మంచి అండదండలు అందించారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వై‌యస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శోభా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, విషమ పరిస్థితిలో హైదరాబాద్ కే‌ర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఎన్నికల ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబా‌ద్ వెళ్తున్నానని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన బహిరంగ సభలో చెప్పి హుటాహుటిన బయలుదేరారు.

Back to Top