బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలి

ఏపీ అసెంబ్లీ: రాష్ట్రంలోని బుడగ జంగాల కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన బుడగ జంగాలల సమస్యలపై సభలో మాట్లాడారు. రాష్ట్రంలో 4 లక్షల మంది బుడగ జంగాల కులానికి చెందిన వారు ఉన్నారన్నారు. వారంత బిక్షాటన చేస్తూ సంచార జీవనం గుడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రాల్లో వీరిని ఎస్సీలుగా పరిగణిస్తున్నారని, మన రాజ్యాగంలో కూడా వారిని ఎస్సీలుగా పొందుపరిచారని గుర్తు చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది వరకే వన్‌మ్యాన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు. అయితే మంత్రి రావెల కిషోర్‌బాబు మాత్రం త్వరలో వన్‌మ్యాన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామంటున్నారు. ఏది వాస్తవమని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. మా నియోజకవర్గంలో ఒక వీధిలో కర్నాటకకు చెందిన వారు, మరో వీధిలో ఏపీకి చెందిన వారు ఉన్నారని, వీరిలో కొందరు ఎస్సీలుగా, మరి కొందరు బీసీలుగా ఉన్నారని ఇలా తారతమ్యం ఎందుకని ప్రశ్నించారు. గతంలో బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవో విడుదల చేశారని, ఆ జీవోను పరిశీలించి బుడగ జంగాలను ఎస్సీలుగా పరిగణించాలని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top