ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించ వద్దు

హోదాకు ద్రోహం చేసిన పార్టీలకు ప్రజలే బుద్ది చెపుతారు
ఎంపీల సమరదీక్షలో సిపిఐ నేత డి.రాజా

ఢిల్లీ:  ప్రత్యేక హోదా సాధనకు తమ పదవులను తృణప్రాయంగా వదిలేసి, ఆమరణ దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపిల దీక్షకు సిపిఐ జాతీయ నాయకులు డి. రాజా సంఘీభావం ప్రకటించారు. ఆదివారం సాయంత్రం ఆయన సమరదీక్ష సభాస్థలికి వచ్చి ఎంపిలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ను ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. పార్లమెంటు అనేది ప్రజాస్వామ్యంలో సుప్రీమని అటువంటి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతుందన్నారు. ప్రధాన మంత్రి, బిజెపి నేతృత్వంలోని  ఎన్డీఎ ప్రభుత్వం పార్లమెంటును, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయవద్దని,  కించపరచవద్దని సూచించారు. 
పార్లమెంటు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంటే, అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించి అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.  ఇలాంటివి చేయకపోతే, దేశ పరిస్థితి ఏమిటని, ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమంటూ ప్రధాన మంత్రి మోడీ తీరును ఆక్షేపించారు.  ప్రజల్లోని సెంటిమెంట్ ను పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైయస్ ఆర్ కాంగ్రెస్ ఎంపిలు తమ వయోభారాన్ని కూడా పక్కకు పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి దీక్షను చేస్తున్నారని, ఇకనైనా ప్రధాన మంత్రి మోడి స్పందించాలని డిమాండ్ చేశారు. హోదా విషయంలో తమను మోసం చేసిన పార్టీల గురించి ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు.


తాజా ఫోటోలు

Back to Top