బెల్టు షాపులకు శ్రీకారం చుట్టింది బాబే: శోభ

బాపట్ల (గుంటూరు జిల్లా), 5 మే 2013: బెల్టు షాపులను ఎత్తివేసే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకురాలు‌ భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. మద్యపాన నిషేధంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి నిర్దిష్టమైన విధానం ఉందన్నారు.‌ గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం నిర్వహించిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు 'మహిళా నగారా'లో‌ ఆమె ప్రసంగించారు. రాష్ట్రంలో బెల్టు షాపు అనేదే లేకుండా చేయాలన్నది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆలోచన అని అన్నారు. ఒకపక్క మద్యం ధరలు తగ్గించాలని, మరోపక్క బెల్టు షాపులు ఎత్తివేస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించబోరన్నారు. బెల్టు షాపులకు శ్రీకారం చుట్టిందే చంద్రబాబు కాదా అని భూమా శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి బయటికి వచ్చి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పెట్టినప్పుడు రాష్ట్రంలోని మహిళలందరూ పార్టీలకు అతీతంగా అక్కున చేర్చుకున్నారని శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. ఏ జిల్లాకు, ఏ గ్రామానికి వచ్చినా సాధారణ, ఉన్నత కుటుంబాలలోని మహిళలందరూ ఆయనను సొంత కొడుకులా ఆదరించారన్నారు. శ్రీ జగన్‌కు స్ఫూర్తినిచ్చింది మహిళలే అని ఆమె అన్నారు. శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక, కుట్ర చేసి అన్యాయంగా జైలులో పెట్టినప్పుడు కూడా ముందుకు వచ్చి ఉద్యమించింది మహిళలే అన్నారు. శ్రీమతి విజయమ్మ, శ్రీమతి షర్మిల తమకు ఎన్ని కష్టాలు ఉన్నా దిగమింగుకుని ప్రజల కష్టాలు తీర్చేందుకు మేమున్నామంటూ ముందుకు రావడం హర్షణీయం అన్నారు.

గతంలో ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని విధిస్తే చంద్రబాబునాయుడు వీధికో బెల్టుషాపు పెట్టించిన ఘనుడని ఆరోపించారు. చంద్రబాబు నిర్ణయం కారణంగా రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మద్యపానాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తోందన్నారు. మద్యం మీద ఎన్ని కోట్ల ఆదాయం వస్తుందో అనే చూస్తోంది తప్ప ఎంత మంది మహిళలపై పురుషులు తాగా అత్యాచారాలు చేస్తున్నారో అలోచించడం లేదని దుయ్యబట్టారు. ఎక్సైజ్‌ శాఖకు మద్యం విక్రయాల టార్గెట్‌లు పెట్టడాన్ని ఆమె తప్పుపట్టారు. మద్యం ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన చంద్రబాబు తీరును ఆమె ప్రశ్నించారు. ధరలు తగ్గించి, ఎక్కువ మద్యాన్ని ప్రజల చేత తాగించాలన్నదే టిడిపి విధానమా? అని చంద్రబాబును ఆమె సూటిగా ప్రశ్నించారు.

బెల్టు షాపుల నిషేధం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు శోభా నాగిరెడ్డి తెలిపారు. మహిళా నగారా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సదస్సుకు హాజరైన మహిళా నాయకులకు ఆమె పిలుపునిచ్చారు.

తాజా ఫోటోలు

Back to Top