బీసీలకు న్యాయం చేసిన జగన్: కృష్ణదాస్

హైదరాబాద్, 09 మార్చి 2013:

బీసీలకు మేలు చేయాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ  వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి ఆలోచనా విధానమనీ, అందుకే పార్టీకి లభించే ఒక్క ఎమ్మెల్సీ సీటును వెనుకబడిన తరగతులకు చెందిన ఆదిరెడ్డి అప్పారావుకు కేటాయించారనీ పార్టీ శాసన సభాపక్షం ఉప నాయకుడు ధర్మాన కృష్ణదాస్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం అప్పారావు నామినేషన్ దాఖలు కార్యక్రమం ముగిశాక కృష్ణదాస్ పార్టీ సహచర ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అప్పారావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వల్ల బీసీలకు న్యాయం చేసినట్లయిందనీ, ఇది  సముచితమైన నిర్ణయమనీ రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తున్నారన్నారు. అప్పారావు ఒక్క బీసీల్లోనే కాదు, ఇతర వర్గాల ప్రజలతో కూడా కలిసి మెలిసి ఉంటారని ఆయన పేర్కొన్నారు. రెండో అభ్యర్థిని రంగంలోకి దించుతారా అని ప్రశ్నించినపుడు ఇంకా నిర్ణయం తీసుకోలేదని గడికోట శ్రీకాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. ఎదుటి పక్షం వ్యూహాలను బట్టి తమ వైఖరి కూడా ఉంటుందని ధర్మాన అన్నారు. మీ అభ్యర్థి గెలుపునకు కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు ఉందా అని ప్రశ్నించినపుడు ‘పోలింగ్‌లో తెలుస్తుంది కదా...మా బలం ఏమిటో...తొందరెందుకు...?’ అని శ్రీకాంత్ అన్నారు.

జగన్ నేతృత్వంలోనే బీసీలకు న్యాయం

     శ్రీ వై.యస్. జగన్మోహన్‌ రెడ్డి తన సారథ్యంలోనే బీసీలకు న్యాయం చేకూరుతుందని నిరూపించారని ఎమ్మెల్సీ అభ్యర్థి ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. దివంగత మహానేత వై.యస్. రాజశేఖరెడ్డి ఆశీస్సులు, గౌరవాధ్యక్షురాలు వై.యస్.విజయమ్మ, శ్రీ జగన్మోహన్ రెడ్డి సహకారంతో తనకు ఎమ్మెల్సీ టికెట్ వచ్చిందని పేర్కొన్నారు. కుల వృత్తులు నశిస్తున్నాయనుకుంటున్న తరుణంలో ఆ వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ తనను ఎంపిక చేశారన్నారు. ఇందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. శాసనసభ ఎన్నికల్లో వంద టికెట్లు ఇస్తామని కొన్ని రాజకీయ పార్టీలు గొప్పలు చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం ఏమీ చేయడం లేదని, కాని శ్రీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆచరణలో బీసీలకు ప్రాధాన్యం కల్పించారనీ  చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా శ్రీ జగన్మోహన్ రెడ్డి వైఖరికి తన ఎంపికే నిదర్శనమని ఆయన అన్నారు.

Back to Top