కాంగ్రెస్‌తో డీల్‌ కుదిరింది మీకు కాదా బాబూ?

హైదరాబాద్‌ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి పేరు వింటేనే చంద్రబాబు నాయుడికి ముచ్చెమటలు పడుతున్నాయని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ వి‌ప్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. నిత్యం జనం మధ్యలో ఉండాల్సిన నాయకుడు బెయిల్ కోసం, అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కోర్టులో పిటిషన్ వే‌యగానే చంద్రబాబు బస్సు యాత్రను అర్ధంతరంగా రద్దుచేసుకుని మరీ ఢిల్లీ వెళ్తున్నారని నిప్పులు చెరిగారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఏదో డీల్ కుదుర్చుకు‌న్నదని చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు బాలినేని ఆదివారంనాబు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిజానికి కాంగ్రెస్‌తో డీల్ కుదుర్చుకున్నది ‌చంద్రబాబే అన్నారు. అలాంటిది తమ పార్టీపై విమర్శలు చేయడమేంటంటూ చంద్రబాబుకు బాలినేని పలు ప్రశ్నలు సంధించారు.

- కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన ‌టిడిపి గత నాలుగేళ్లుగా ఎవరితో పోరాడుతోంది?
- శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద కాంగ్రెస్ నేత శంకర్రావు, ‌టిడిపి ఉమ్మడిగా పిటిషన్ వేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలు, కడప లో‌క్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమాచార కమిషనర్ల నియామకం, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, రిటైల్ ఎ‌ఫ్‌డిఐ అనుమతులపై రాజ్యసభలో కాంగ్రెస్‌కు అనుకూలంగా టిడిపి ఎంపిల గైర్హాజరు... ఇవన్నీ కాంగ్రెస్‌తో టిడిపి కలిసిపోయిందనడానికి నిదర్శనాలు కావా? ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్‌పై మీరు కనీసమాత్రంగానైనా చేసిన పోరాటాలేమిటి? వేళ్ల మీద లెక్కపుట్టి నాలుగు చెప్పగలరా? చిదంబరం, అహ్మద్ పటే‌ల్, హె‌చ్ఆ‌ర్ భరద్వా‌జ్, దిగ్విజ‌య్‌సింగ్, రేణుకాచౌదరి వంటి కాంగ్రెస్ నేతలతో మీరు మాట్లాడ్డం లేదని (ట‌ల్‌లో లేరని) కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేసి చెప్పగలరా?

- చంద్రబాబూ.. మీరు ఏ డీల్ ప్రకారం గత నాలుగేళ్లుగా కాంగ్రె‌స్ ప్రభుత్వానికి అన్నీ మీరై మద్దతిచ్చారు? ఏ డీల్ ప్రకారం 2008లో ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖను వెనక్కు తీసుకోవడం లేదు? ఏ డీ‌ల్ ప్రకారం చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రె‌స్‌లో కలపక ముందు ఆ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, తద్వారా ప్రభుత్వం పడిపోకుండా సహకరించారు? ఏ డీల్ ప్రకారం వై‌యస్ఆర్‌ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పాల్గొనొద్దంటూ మీ టిడిపి ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు? ఏ డీ‌ల్ ప్రకారం ‌టిడిసి ఎంపిలు కాంగ్రెస్ కోటరీలోని వ్యక్తుల్ని శనివారం ఢిల్లీలో ఓ హోట‌ల్‌లో కలుసుకున్నారు? ఏ డీల్ ప్రకారం మీరు ‌సిబిఐ, ఈడీ కేసులు మీ మీద రాకుండా కాంగ్రెస్ కాళ్లా‌ వేళ్లా పడ్డారు. ఏ డీల్ ప్రకారం మీరు రాష్ట్ర విభజనకు అంగీకరించారు? ఏ డీ‌ల్ కుదుర్చుకునేందుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు?
- కాంగ్రెస్‌తో శ్రీ జగన్ కుమ్మక్కయ్యారని, ఇతరత్రా పచ్చి అబద్ధాలతో గత 16 నెలలుగా కొన్ని జాతీయ వార్తా పత్రికల్లో మీకు బాగా తెలిసిన మీడియా మేనే‌జ్‌మెంట్ పద్ధతుల్లో వార్తలు, కథనాల నాట్లు వేయించారు.‌ శ్రీ జగన్‌ను జనంలో ఎదుర్కొనే ధైర్యం మీకుందా? అది లేకే కదా మీ ఢిల్లీ రాజకీయాలు, కాంగ్రెస్‌తో మీ కుమ్మక్కులు!

- అన్నింటి కంటే ముఖ్యంగా... ఎన్టీఆర్ స్థాపించిన ‌టిడిపి 1984 నుంచి 2013 వరకూ 30 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చేయలేని నష్టం... పుట్టి మూడేళ్లయినా కాని వైయస్ఆర్‌ కాంగ్రెస్ వల్ల జరిగింది. కాంగ్రె‌స్‌ను భూస్థాపితం చేయటానికి, ఢిల్లీనే ఎదిరించి ముందుకు వెళ్లటానికి, తనను ఎంతటి కష్టాలు పెడుతున్నా నిబ్బరంగా నిలబడటానికి ప్రతీకగా మారిన శ్రీ జగన్ ఈ రోజు ఏ పార్టీతోనైనా ఎందుకు డీ‌ల్ కుదుర్చుకోవాలి? తెరచాటు ఒప్పందాలు, మనుషుల కొనుగోళ్లు, అధికారం కోసం వెన్నుపోట్లు మీకు మాత్రమే తెలిసిన విద్యలు. కేసులు వేయించింది మీరు, కాంగ్రెస్. వాటిని ఎదుర్కొంటున్నది‌ శ్రీ జగన్. మరిక ఎవరు కుమ్మక్కయినట్టు? కుమ్మక్కయితే మా నాయకుడు 16 నెలలుగా నిర్బంధంలో ఉండేవాడా? కుమ్మక్కు కావాల్సిన కర్మ శ్రీ జగన్‌కు ఎందుకొస్తుంది? ఆయనపై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టినందుకా? జైల్లో ములాఖ‌త్ విషయంలోనూ కర్కశంగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులను కూడా మీరు మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నందుకా? ప్రజలు ఈ మాత్రం ఆలోచిస్తారని కూడా మీరు గుర్తించరా?

- నిజం చెప్పండి చంద్రబాబు గారూ! ఈ రోజు కాంగ్రెస్ లేకుండా మీరు బతకగలిగిన పరిస్థితి ఉందా బాబూ? కాంగ్రె‌స్‌తో కుమ్మక్కు కాకుండా మీరు ఒక్క అసెంబ్లీ సీటయినా తెచ్చుకోగల పరిస్థితి ఉందా? కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన 45 ఉప ఎన్నికల్లో ఏకంగా 26 చోట్ల మీ టిడిపికి డిపాజిట్లు పోయాయి! మీరు, మీ నాయకత్వం ఒక స్వతంత్ర పార్టీగా మనగలిగిన పరిస్థితంటూ అసలుందా? 30 శాతం కాంగ్రెస్ వాదినని చెప్పుకున్న మీలో ఈ రోజున 3 శాతమైనా ఎన్టీఆ‌ర్ స్థాపించిన కాంగ్రె‌స్ వ్యతిరేక ‌టిడిపి రక్తముందా? లేక 97 శాతం కాంగ్రెస్ రక్తమే ఉందా? ఓట్లూ, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడతామంటూ ‌సిడబ్ల్యుసి, యుపిఎ తీర్మానించినా దానివల్ల 6 కోట్ల మందికి కలిగే కష్టనష్టాల విషయంలో కూడా మీ గుండె కరగలేదు. మీ కాలు కదలలేదు. విభజన నిర్ణయం వెలువడ్డ 47 రోజుల తరవాత కూడా సమైక్య రాష్ట్రం కోసం ఒక్క మాటా మాట్లాడలేదు. అలాంటిది, అర్ధంతరంగా బస్సు యాత్ర ఆపి, ఢిల్లీ వెళ్లి మీ చీకటి మిత్రులను కలుసుకోవడానికి హడావుడి పడ్డారంటే, అది కేవలం ఒకే ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా కాదా?

- మీరు ప్రజల్లో లేకపోయినా మీడియాలో ఒక వర్గాన్ని, అధికార పార్టీలను, వ్యవస్థల్లోని వ్యక్తులను మేనేజ్ చేసి, ఇలాంటి నీచ రాజకీయాలు చేసి బతికేయాలన్న మీ ఆలోచన మీకే సిగ్గుగా అనిపించడం లేదా?

Back to Top