విజయమ్మ వస్తే.. సమైక్యం బలపడుతుందనా?

హైదరాబాద్, 31 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తే.. తెలంగాణ ‌వాదం పలచబడుతుందనో.. సమైక్య వాదం బలపడుతుందనో భయంతోనే మంత్రులు జానారెడ్డి, ఉత్తంకుమార్‌రెడ్డిలు ప్రజలను రెచ్చగొడుతున్నారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్‌ వ్యాఖ్యానించారు. వరద ముంపు బాధితులను పరామర్శించడానికి, వారికి ధైర్యం చెప్పేందుకు శ్రీమతి విజయమ్మ పర్యటిస్తుంటే.. తెలంగాణ ప్రాంత మంత్రులైన వారిద్దరికీ నొప్పేంటి? అని బాజిరెడ్డి గోవర్దన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పై లీన్‌ తుపాను, తరువాత రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో చేతికి వచ్చిన పంటలు విపరీతంగా నష్టపోయి అన్నదాతలు విలవిలలాడుతుంటే.. ప్రభుత్వం, ప్రతిపక్షం వారికి ధైర్యం కల్పించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం తమ బాధ్యతను విస్మరించినా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, శాసనసభా పక్షం నాయకురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని బాజిరెడ్డి తెలిపారు. గురువారం నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్న శ్రీమతి విజయమ్మను అడ్డుకోవాలని మంత్రులు ఉత్తంకుమార్‌రెడ్డి, జానారెడ్డి, మరి కొందరు నాయకులు పిలుపునివ్వడం ఏమిటని ఆయన నిలదీశారు. ఇలాంటి మంత్రులు, నాయకుల చిత్తశుద్ధి ఏమిటో ప్రజలే గమనిస్తున్నారని హెచ్చరించారు.

వరద ముంపు నష్టాలను స్వయంగా పరిశీలించి, బాదితులకు భరోసా కల్పించడంతో పాటు శాసనసభ శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి శ్రీమతి విజయమ్మ పర్యటిస్తున్నారని బాజిరెడ్డి తెలిపారు. పార్టీ నాయకురాలిగా శ్రీమతి విజయమ్మ జిల్లాల్లో పర్యటిస్తుంటే ప్రజలను మంత్రులు రెచ్చగొట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, వారిని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి నల్గొండ జిల్లాకు వెళుతున్న శ్రీమతి విజయమ్మను అడ్డుకోవడం ఏమిటన్నారు. పోలీసుల దుశ్చర్యకు నిరసనగా శ్రీమతి విజయమ్మ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారన్నారు.

ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఇరు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తంకుమార్, జానారెడ్డిలు నిజంగా తెలంగాణ ప్రజల కోసం కృషి చేస్తున్నారా? అని ప్రశ్నించారు. చీకట్లో తమ పబ్బం గడుపుకుంటూ.. పైకి మాత్రం తెలంగాణ వాదం వినిపిస్తున్నారని అన్నారు. తెలంగాణపై ఉత్తం, జానాలకు చిత్తశుద్ధి ఉంటే సమైక్యంపై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌ను ఆయన కేబినెట్లో ఉండి ఏ విధంగా భరిస్తున్నారని నిలదీశారు. తెలంగాణ వాదులను రెచ్చగొడుతున్న మంత్రులు దమ్మంటే ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి చేత రాజీనామా చేయించాలని, ఆయనను తెలంగాణలో తిరగనివ్వకుండా చేయాలని సవాల్‌ చేశారు.

రాష్ట్రంలో ఎవరు పర్యటించినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సహకరించాలని బాజిరెడ్డి గోవర్దన్‌ అన్నారు. కోర్టు షరుతుల సడలించిన నేపథ్యంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తారన్నారు. ప్రజలను రెచ్చగొట్టి నాయకులను ఇబ్బంది పెట్టవద్దని ఆయన డిమాండ్‌ చేశారు.

Back to Top