అన్న అడుగు టీడీపీ గుండెల్లో గునపం దింపుతోంది


హిందూ ధర్మాన్ని భ్రష్టుపట్టించిన చంద్రబాబు
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

చిత్తూరు: ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వేసే ఒక్కో అడుగు చంద్రబాబు పార్టీ గుండెల్లో గునపం దించే విధంగా ఉందని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. పాదయాత్ర ద్వారా వైయస్‌ జగన్‌ వస్తుంటే ప్రజలంతా స్వచ్ఛందంగా తరలివచ్చి వారి సమస్యలు చెప్పుకుంటున్నారన్నారు. దామరచెరువులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులను పెట్టుకొని చంద్రబాబు జన్మభూమి సమావేశాలను నిర్వహిస్తున్నాడని రోజా ఎద్దేవా చేశారు. జన్మభూమి సమావేశాల్లో టీడీపీ నేతలను ప్రజలంతా ప్రశ్నిస్తుంటే పోలీసులతో వారిని సభ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతే కాకుండా సభలకు ప్రజల రాకపోవడంతో పాఠశాలల నుంచి విద్యార్థులను పిలిపించుకుంటున్నారన్నారు. వైయస్‌ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ప్రస్టేషన్‌ పీక్స్‌కు వెళ్లిందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. మత్స్యకారులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే తాటతీస్తానని, అదే విధంగా ఓట్లు వేయకపోతే ప్రజలే సిగ్గుపడాలని వింత మాటలు మాట్లాడుతున్నాడన్నారు. 

తన కొడుకును వార్డు మెంబర్‌గా కూడా గెలిపించుకోలేని చంద్రబాబు లోకేష్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు క్షుద్రపూజలు చేపిస్తున్నాడని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పాలక మండలి ఒప్పుకుందని, కానీ చంద్రబాబు మంత్రి మాణిక్యాలరావును అడ్డుపెట్టుకొని నిజాలు పాతరేయడానికి చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు వేసిన ఏ ఒక్క కమిటీలు కూడా నిజాలు వెలికితీయలేదన్నారు. ఇప్పుడు వేసిన నిజనిర్ధారణ కమిటీ కూడా వాస్తవాలను సమాధి చేస్తుందన్నారు. దుర్గగుడి ఈఓను బదిలి చేసి మొత్తం ఆమె నెత్తిన వేసి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్నట్లుగా చంద్రబాబు తాంత్రిక పూజలు చేయిస్తున్నాడన్నారు. హిందూ సంప్రదాయాన్ని భ్రష్టుపట్టించే విధంగా చంద్రబాబు వైఖరి ఉందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 
Back to Top