వైయస్‌ జగన్‌తో చర్చకు సిద్ధమా బాబు..?

  • బాబుకు దమ్ముంటే హోదాపై చర్చకు రావాలని సవాల్
  • యువభేరితో టీడీపీ నేతల గూబలు గుయ్యిమన్నాయి
  • దేవినేని ఉమ ఓ దద్దమ్మ మంత్రి
  • విశ్వసనీయతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ వైయస్‌ జగన్‌
  • వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
విజయవాడ: చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదాపై వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధపడాలని అని వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి సవాల్‌ విసిరారు. చర్చకు  వచ్చే దమ్ముంటే సమయం, ప్రదేశం మీరే నిర్ణయించండి, లేదా పచ్చ పత్రికల సమక్షంలో బహిరంగ చర్చకైనా వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందని చంద్రబాబుకు చాలెంజ్‌ విసిరారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలకు దిగుతున్న టీడీపీ మంత్రులపై పార్థసారధి విరుచుకుపడ్డారు. విజయవాడలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... ఏలూరు యువభేరిలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు వణికిపోతున్న చంద్రబాబు తన మంత్రులతో వైయస్‌ జగన్‌పై ఎదురుదాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఏ పత్రిక కథనాలు చూసినా మంత్రుల నుంచి కార్యకర్తల వరకు వైయస్‌ జగన్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. 

ఏలూరులో యువభేరి దెబ్బకు చంద్రబాబు, టీడీపీ నేతల గూబలు గుయ్యుమన్నాయని ఎద్దేవా చేశారు. హోదా విషయంలో చంద్రబాబు మోసాన్ని వైయస్‌ జగన్‌ కళ్లకు కట్టినట్లుగా ప్రజానికానికి వివరించారన్నారు. ప్రత్యేకహోదాపై విద్యార్థులు అడిగే ప్రశ్నలకు బాబు సమాధానం చెప్పుకోలేక వైయస్‌ జగన్‌ పై కేసులు, విచారణలు అంటూ బురజల్లుతున్నారని ఫైర్ అయ్యారు. బాబు తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడడం లేదని దుయ్యబట్టారు. ఒక పక్క టీడీపీ నేతలు హోదా కోసం ప్రయత్నం చేస్తున్నామని చెబుతుంటే.. చంద్రబాబు అర్థరాత్రి అభూత కల్పన ప్యాకేజీని ఆహ్వానిస్తున్నారని నిప్పులు చెరిగారు. హోదా విషయంలో టీడీపీ విధానం ఏంటని పార్థసారధి చంద్రబాబును ప్రశ్నించారు. 

కేంద్రాన్ని అడిగే దమ్మూ, ధైర్యం లేదా?
హోదా వల్ల కలిగే లాభాలకంటే మెరుగైన లాభాలు ఇస్తామని బీజేపీ చెబుతుంటే ఏ విధంగా మెరుగైందో కేంద్రాన్ని అడిగే దమ్మూ, ధైర్యం బాబుకు లేదా అని పార్థసారధి  నిలదీశారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏం సాధించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 34 సంవత్సరాలు రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న బాబు విభజన చట్టంలోని హామీలను పొందడంలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు. హోదాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అజాగలస్థనాలు (మేకమెడలోని భాగం) లతో పోల్చారు. చంద్రబాబు వైఖరి కూడా అదేనా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. హోదా లభిస్తే పరిశ్రమలు ఏర్పడతాయి, ఎక్సైజ్, ఇన్‌కంట్యాక్స్, సేల్స్‌ ట్యాక్స్‌ రాయితీలు ఉంటాయి వాటిని మీ ప్యాకేజీలో ఇచ్చారా ? అని వెంకయ్యను ప్రశ్నించారు. హోదా వస్తే కేంద్రం చేపట్టే ప్రతి ప్రాజెక్టులో 90 శాతం గ్రాంట్స్‌గా ఇస్తారని తెలిపారు. అలాంటివి ఏమైనా సాధించారా అని చంద్రబాబును నిలదీశారు. 

విశ్వసనీయత అంటే వైయస్‌ఆర్‌ కుటుంబానిదే
రాష్ట్రంలోని రాజకీయ నేతలకు విశ్వసనీయత ఎవరికైనా ఉందంటే అది కేవలం వైయస్‌ఆర్‌ కుటుంబానికేనని పార్థసారధి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎంగా అమలు పర్చి మాట నిలబెట్టుకొని విలువలు, విశ్వసనీయతకు మారుపేరుగా దివంగత మహానేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రకెక్కారని గుర్తు చేశారు. అవే లక్షణాలను అలవర్చకున్న వైయస్‌ జగన్‌ విశ్వసనీయతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని చెప్పారు. రాష్ట్రంలో దేవినేని ఉమ లాంటి దద్దమ్మ ఇరిగేషన్‌ మంత్రి ఎప్పుడూ చూడలేదని పార్థసారధి ధ్వజమెత్తారు. వైయస్‌ జగన్‌ సభలకు విద్యార్థులను వెళ్లోద్దని ప్రకటన చేస్తే ఆఖరికి చంద్రబాబు సభకు విద్యార్థులు కరువయ్యారని చురకంటించారు. 

విద్యార్థులు, నిరుద్యోగులు, యువత అంతా బాబును అసహ్యంచుకుంటున్నారన్నారు. రూ. 200 కోట్లతో కృష్ణాడెల్టాకు 40 టీఎంసీల నీరు ఇవ్వగలిగే ప్రాజెక్టు కళ్లముందుంటే... ఆ ప్రాజెక్టుకు నిర్మించకుండా పట్టిసీమ పేరుతో చంద్రబాబుకు, కాంట్రాక్టర్‌లకు బ్రోకర్‌గా వ్యవహరించాడన్నారు. రూ. 16 వందల కోట్లతో పట్టిసీమ నిర్మించి కృష్ణకు 14 టీఎంసీలు తీసుకొచ్చి సంకలు కొట్టుకునే అటు ఇటు కాని నాయకుడు దేవినేని ఉమ అని ధ్వజమెత్తారు.  అలాంటి దేవినేని అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోషల్‌ మీడియాలో తెలుగు తమ్ముళ్లు కొత్త నదులను సృష్టిస్తున్నారని పార్థసారధి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పట్టిసీమ నది అంటూ పుకార్లు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వలకు, నదులకు తేడా తెలియని దద్దమ్మలు టీడీపీ నేతలనేది స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే వైయస్‌ జగన్‌ను ఒప్పించి తాను చర్చకు తీసుకువస్తానని పార్థసారథి ప్రకటించారు. ఓటుకు కోట్లు కేసులో భయపడి హైదరాబాద్‌లో చర్చకు నిరాకరించినా విజయవాడలోనైనా, కుప్పంలోనైనా సరే చర్చకు సిద్ధమన్నారు. 
 
Back to Top