జగన్‌పై బాబు గోబెల్సు ప్రచారం: విజయమ్మ

జోగిపేట 25 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గోబెల్సు ప్రచారం చేస్తున్నారని పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మండిపడ్డారు. తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా ఆమె మంగళవారం మెదక్ జిల్లా జోగిపేటకు వెళ్ళారు. అక్కడ ఏర్పాటు చేసిన పార్టీ సదస్సులో  ఆమె మాట్లాడారు.  తొలుత ఆమె అమరవీరులకు  నివాళులర్పించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలని శ్రీమతి విజయమ్మ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. టిడిపి-కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కుమ్మక్కు రాజకీయాలు కలసికట్టుగా ఎదుర్కొంటామని ఆమె స్పష్టంచేశారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తనతో సహా పార్టీ నేతలు అందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మహానేత హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని డాక్టర్ వైయస్ఆర్ గుర్తించారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదన్నారు. నేడు 108 వాహనాలు కనిపించడంలేదని చెప్పారు. రైతుల సమస్యలు పట్టించుకునేవారు లేరన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు.

పద్ధతి ప్రకారం తొలుత మున్సిపల్, మండలాలు, తరవాత పంచాయతీ ఎన్నికలు జరగాలనీ, కానీ టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యి పంచాయతీ ఎన్నికలను ముందు నిర్వహిస్తున్నారనీ ఆమె ఆరోపించారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి తమదే గెలుపని చెప్పుకోవడం కోసం వీటిని నిర్వహిస్తున్నారని ఆమె విశ్లేషించారు. కార్యకర్తలను  రాజశేఖరరెడ్డిగారు ఎంతో గౌరవించేవారన్నారు. మీ సహకారం, కృషి ఆయనను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని పేర్కొన్నారు.  తమ కుటుంబం ప్రజల వెంట ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలకే ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచి ప్రజలకు సేవచేయాలని కోరారు. మన మధ్య ఉన్న సమస్యలను పక్కనబెట్టి  పార్టీ గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలంటే భయం లేదనీ ముఖ్యమంత్రీ, ఎన్నికలు జరగలేదని బాధగా ఉందని మంత్రి చెబుతున్నారనీ ఎద్దేవా చేశారు. సకాలంలో ఎన్నికలు జరిగుంటే అసౌకర్యాలు ఉండేవి కాదన్నారు. ప్రజల బాగోగులు గురించి ఎవరికీ పట్టడం లేదన్నారు. అధికారులు ప్రభుత్వానికి మాత్రమే జవాబుదారీ అనీ అదే ప్రజా ప్రతినిధులైతే ప్రజలకు జవాబుదారీగా ఉంటారనీ పేర్కొన్నారు. రాజన్న హయాంలో అన్ని ఎన్నికలూ సకాలంలో జరిగాయన్నారు. ఈ సందర్భంలో రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం ఆడిన డ్రామాను శ్రీమతి విజయమ్మ గణాంకాలతో వివరించారు. ఎన్ని నిధులు మురిగిపోయాయో కూడా వివరించారు.
చంద్రబాబు ప్రభుత్వంలో రెండు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించారన్నారు. ఆయన రాసుకున్న మనసులో మాట పుస్తకంలో స్థానిక సంస్థలకు విధులు.. నిధులు అవసరమనీ, కరెంటు కూడా ఉచితంగా ఇవ్వననివసరం లేదనీ ఉందన్నారు. చిన్న పంచాయతీలు తమ కరెంటు ఖర్చు తామే భరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో అవి చీకట్లో మగ్గుతున్నాయనీ, కనీసం మంచినీటిని సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నాయనీ తెలిపారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో దాదాపు రెండున్నలక్షల మంది ప్రజా ప్రతినిధుల పదవులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. వారేం అనుకున్నా మీరు వేసే ఓటు జగన్ బాబుని దృష్టిలో ఉంచుకుని వేయాలన్నారు. ఎన్నికలలలో నిలబడే వారికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎన్నికలను కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోరాదని సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి సొసైటీ ఎన్నికల్లో అప్రజాస్వామికంగా వ్యవహరించారన్నారు. మనకి బాగుందనే ఉద్దేశంతో అశ్రద్ధంగా వ్యవహరించరాదని కోరారు. పరస్పర సహకారంతో పనిచేసి అన్ని ఎన్నికల్లో మనమే గెలవాలని పిలుపునిచ్చారు. నామినేషన్ దగ్గర్నుంచి అందరూ జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

తెలంగాణవాదమంటే జగన్‌కు గౌరవముంది
రాజశేఖరరెడ్డి గారు తెలంగాణ వాదాన్ని గౌరవించారనీ, జగన్ బాబు కూడా తెలంగాణ వాదాన్ని మన్నిస్తారని శ్రీమతి విజయమ్మ వెల్లడించారు. రాజన్న తెలంగాణ వెనుకబాటు తనాన్ని ఎప్పుడో గమనించారన్నారు. ఆయన అందరి కష్టాలనూ గమనించారన్నారు. రైతు బాగుపడడానికి.. పంటకు గిట్టుబాటు ధర, పండించే ఖర్చు తగ్గాలని ఆకాంక్షించేవారన్నారు. అందుకు అనుగుణంగానే ఉచిత విద్యుత్తు ఇచ్చి, రుణాలు మాఫీ చేశారని వివరించారు.

ధరల పెరుగుదలలో రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికీ, చంద్రబాబు ప్రభుత్వానికీ, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడాను గణాంకాలతో శ్రీమతి విజయమ్మ వివరించారు. ఉచిత విద్యుత్తు వల్ల 70 శాతం మంది తెలంగాణ ప్రజలే లాభపడ్డారన్నారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు తదితర పథకాలను గురించి సవివరింగా వివరించారు. ప్రాణహిత చేవేళ్ళ పథకం రాజన్న మానస పుత్రికని చెప్పారు. ఎన్నో ప్రాజెక్టులకు రూపకల్పన చేశాన్నారు. మహానేత మరణానంతరం ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు.
రాజశేఖర రెడ్డిగారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. విద్యావకాశాలను ఏరకంగా మెరుగుపరిచిందీ కూడా తెలియజేశారు. ఆయన రెక్కల కష్టం మీద అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏంచేస్తోందో ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఆయన చెప్పినట్టు ముప్పై కేజీల బియ్యం ఇవ్వడం లేదనీ, తొమ్మిది గంటల కరెంటును రైతుకు సరఫరా చేయడం లేదనీ ఆవేదన వ్యక్తంచేశారు. పైగా క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. పరిశ్రమలు కరెంటు లేక మూతపడుతున్నాయని తెలిపారు. కరెంటు చార్జీల పెంపును కూడా ఆమె సోదాహరణంగా తెలియజేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక్క ఎకరం కూడా పంచిన పాపాన పోలేదన్నారు. గ్యాస్ ధర పెరిగితే తన అక్కచెల్లెళ్ళు ఇబ్బంది పడతారని భావించి రాజన్న ఒక్క రూపాయి కూడా పెంచలేదన్నారు. రాజీవ్ ఉద్యోగ కిరణాలు పథకంలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారని చెప్పారు. ఉన్న ఉద్యోగులను సవ్యంగా చూసుకుంటే చాలని ఆమె హితవు పలికారు. అందుకు ఉదాహరణగా 108, 104 సర్వీసుల ఉద్యోగులను చూపారు. ఫీజు రీయింబర్సుమెంటు కొత్తకొత్త నిబంధనలు పెట్టారన్నారు. లక్షా ఎనబై ఐదు వేల మందికి పింఛన్లు తొలగించారని చెప్పారు. ప్రతీది తగ్గించడం తప్పితే కొత్తగా ఇచ్చిందేమీ లేదన్నారు. బడ్జెట్ పెంచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. అమ్మహస్తం సరకులను సగం చేశారన్నారు. అవి ఎన్ని రోజులు వస్తాయని విజయమ్మ ప్రశ్నించారు. ఓ ఊరికి లారీలో చక్కెర బదులు యూరియా వెళ్లిందనీ, పరిపాలన ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదనీ తెలిపారు.

ఏ ఎండకాగొడుగు పట్టే బాబు
ఏ ఎండాకాగొడుగు పట్టడం.. పార్టీ మార్చడం చంద్రబాబు తత్వమని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. అసెంబ్లీలో చంద్రబాబు వైఖరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే వ్యవహరిస్తున్నట్టుందన్నారు. అంతా చంద్రబాబు సూచనల మేరకే సాగుతోందన్నారు. అవినీతి మంత్రుల తొలగింపు నుంచి అవిశ్వాస తీర్మానం వరకూ అంతా నాటకమేనన్నారు. ఆయన చెప్పినట్లు ప్రభుత్వం ప్రవర్తిస్తోందన్నారు. వ్యవస్థల్నీ, మీడియాని మేనేజ్ చేయడం ఆయనకొచ్చినంతగా ఎవరికీ రాదన్నారు. నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారన్న ఆయన వ్యాఖ్యలను గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను అమలుచేస్తే ప్రజలు సోమరులవుతారన్న చరిత్ర చంద్రబాబుదన్నారు. బియ్యం ధర ఎలా పెంచిందీ శ్రీమతి విజయమ్మ చెప్పారు. తక్కువ ధరకే మద్యం దొరికేలా చూస్తానని ఇప్పుడు బాబు చెబుతున్నారని తెలిపారు. 54 పరిశ్రమలను ఆయన తన వారికి అమ్మారని చెప్పారు. జెన్ కో ను నిర్వీర్యం చేసి, దానం చేశారని చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థను మూసేసి నూజివీడు సీడ్సుకు అప్పగించిన వైనాన్ని తెలియజేశారు. తరచి చూస్తే ప్రజలకు ఏ మేలు చేయలేదని అర్థమవుతుందన్నారు. ఎమ్మార్ సంస్థకు స్థలాలు ఎంత తక్కువకు ఇచ్చింది వివరించారు. ఇదే రాజశేఖరరెడ్డిగారు మారు మూల ప్రాంతాలలో భూములు ఇచ్చారని చెప్పారు. బాబుకు తొమ్మిదేళ్ళ తరవాత బయ్యారం ఉక్కు, ఉచిత విద్యుత్తు.. ఇలా అన్ని విషయాలూ గుర్తొస్తున్నాయన్నారు. తన కుమారుడికి సత్యం రామలింగరాజు ద్వారా ఫీజు రీయింబర్సుమెంటు పొందారని ఎద్దేవా చేశారు.

Back to Top